భారతదేశ 53వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ సోమవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి భవన్‌లో సూర్యకాంత్ చేత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, కేంద్రమంత్రులు, ప్రతిపక్ష నేతలు, పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. 2027 ఫిబ్రవరి 9 వరకు సూర్యకాంత్ పదవిలో కొనసాగనున్నారు. దాదాపు 15 నెలల పాటు సీజేఐగా బాధ్యతలు నిర్వహించనున్నారు. నవంబర్ 23న సీజేఐగా బీఆర్.గవాయ్ పదవీ విరమణ చేశారు. తర్వాత సీజేఐగా సూర్యకాంత్ పేరును ప్రతిపాదించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 124లోని క్లాజు (2) ద్వారా జస్టిస్ సూర్యకాంత్ తదుపరి భారత ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
సూర్యకాంత్ ప్రస్థానం..
జస్టిస్ సూర్యకాంత్ ఫిబ్రవరి 10, 1962న హర్యానాలోని ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. 1984లో హిసార్‌లో తన న్యాయవాద ప్రయాణాన్ని ప్రారంభించారు. పంజాబ్, హర్యానా హైకోర్టులో ప్రాక్టీస్ చేయడానికి చండీగఢ్‌కు వెళ్లారు. జూలై 2000లో హర్యానాకు అతి పిన్న వయస్కుడైన అడ్వకేట్ జనరల్‌గా నియమితులయ్యారు. 2001లో సీనియర్ న్యాయవాదిగా బాధ్యతలు చేపట్టారు. జనవరి 9, 2004న పంజాబ్-హర్యానా హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. తర్వాత అక్టోబర్ 2018 నుంచి మే 24, 2019న సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందే వరకు హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. నవంబర్ 2024 నుంచి సుప్రీంకోర్టు న్యాయ సేవల కమిటీ ఛైర్మన్‌గా కూడా పనిచేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Brahmanandam : తప్పుగా అర్థం చేసుకున్నారు.. కాంట్రవర్సీపై బ్రహ్మానందం క్లారిటీ