NTV Telugu Site icon

Qatar-India: “మా సైనిక శిక్షణే కారణం”.. ఖతార్ ఉరిశిక్ష నుంచి బయటపడిన మాజీ నేవీ సిబ్బంది..

Ragesh Gopa Kumar

Ragesh Gopa Kumar

Qatar-India: ఖతార్ దేశంలో గూఢచర్యం ఆరోపణలతో ఉరిశిక్ష విధించబడిన 8 మంది భారత మాజీ నేవీ అధికారులు, శిక్ష నుంచి బయటపడ్డారు. ఇటీవల వారంతా భారతదేశానికి వచ్చారు. మోడీ ప్రభుత్వ హాయాంలో ఇది అతిపెద్ద దౌత్య విజయంగా భావించబడుతోంది. జలంతర్గామి నిర్మాణంలో ఇజ్రాయిల్ తరుపున గూఢచర్యానికి పాల్పడుతున్నారని చెబుతూ ఖతార్ కోర్టు వీరికి మరణశిక్ష విధించింది. భారత ప్రభుత్వం కలుగజేసుకుని వారిని శిక్ష నుంచి తప్పించగలిగింది.

ఈ నేపథ్యంలో భారత్ తిరిగి వచ్చిన మాజీ నేవీ అధికారి తన అనుభవానలు చెప్పారు. రాగేష్ గోపకుమార్ అక్కడి జైళ్లలో కొన్ని నెలల పాటు శిక్ష అనుభవించారు. తాను తిరిగి సొంత ఊరు తిరువనంతపురం చేసుకోవడంతో భావోద్వేగానికి గురయ్యారు. తన కుటుంబంతో తిరిగి కలుస్తున్నందుకు ఆనందం మరియు కృతజ్ఞతలు తెలిపారు. తాను, తన సహచరులు తమ సైనిక శిక్షణ కారణంగా మానసికంగా ధృడంగా ఉన్నామని, ఈ శిక్షణ మాకు ఉపయోగపడిందని, బతికిపోయామని చెప్పారు.

గోపకుమార్ సోమవారం తిరువనంతపురానికి 16 కిలోమీటర్ల దూరం ఉన్న బలరామపురానికి చేరుకున్నారు. కుటుంబాన్ని చూడగానే ఒక్కసారిగా కన్నీటి పర్యంతమయ్యారు. రోజూ ఐదారుసార్లు ఫోన్ చేసే భర్త, తన భార్యకు ఫోన్ చేయడం మానేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో అని ఆరా తీసిన సమయంలో, తన కుటుంబం ఎంత దీనస్థితిలో ఉందో అర్థమయ్యేదని, తన కుటుంబ ప్రార్థనలు, కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాల వల్లే తాము మళ్లీ స్వదేశానికి వచ్చామని అన్నారు. తమను విడిపించేందుకు చొరవ తీసుకున్న ప్రధాని నరేంద్రమోడీపై ప్రశంసలు కురిపించారు. మోడీజీ జోక్యం చేసుకుంటే తిరిగి స్వదేశానికి వస్తామని తెలుసని, అయితే ఎన్ని రోజులు పడుతుందో తెలియదని గోపకుమార్ అన్నారు.

Read Also: Ramam Raghavam: నా ప్రేమ మొదలయ్యింది నీతోనే డాడీ.. ధనరాజ్ డైరెక్టర్ గా సక్సెస్ అయ్యేలానే ఉన్నాడు

ఒక భారతీయ వ్యక్తి అమాయకుడై, విదేశాల్లో జైలు శిక్ష విధించబడితే, మన ప్రధాని ఆదుకుంటారని, ఈ విషయాన్ని ప్రతీ భారతీయులు తెలుసుకోవాలని ఆయన అన్నారు. 2017లో ఇండియన్ నుంచి రిటైర్ అయినట్లు ఆయన తెలిపారు. ఆ తర్వాత ఒమన్ డిఫెన్స్ ట్రైనింగ్ కంపెనీలో కమ్యూనికేషన్స్ ఇన్‌స్ట్రక్టర్‌గా చేరానని గోపకుమార్ తెలిపారు.

గతేడాది అక్టోబర్ 26న 8 మందికి ఖతార్ కోర్టు మరణశిక్ష విధించింది. ఈ శిక్షను డిసెంబర్ 28న మరణశిక్ష నుంచి మూడు నుంచి 25 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించింది. గతేడాది డిసెంబర్ నెలలో దుబాయ్‌లో జరిగిన COP28 సమ్మిట్‌లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఖతార్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీతో సమావేశమై దీనిపై చర్చించారు.