ప్రజా సమస్యలపై చర్చించి వాటికి పరిష్కారం చూపడం, కొత్త చట్టాలను ఆమోదించడం లాంటి కీలకమైన పనులు చేయాల్సిన చట్టసభల్లో ఆరోపణలు, విమర్శలు, ప్రశ్నలు.. తిట్లు.. ఇలా ఎన్నో చూస్తుంటాం… ప్రజాప్రతినిధులు వాడే భాష కొన్నిసార్లు వినడానికే ఇబ్బందికరంగా ఉండే పరిస్థితి.. ఇక, నిరసనలు, ఆందోళనలు సరేసరి.. కొన్నిసార్లు అవి శృతిమించి స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టడం.. పేపర్లు విసురుకోవడం.. మైకులు విసరడం.. ఇలా ఎన్నో ఘటనలు చూశాం.. కానీ, పార్లమెంట్ సహా రాష్ట్రాల అసెంబ్లీల్లో శాసనసభ్యుల ‘అనుచిత ప్రవర్తన’పై ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు.. సభలో మైకులు విసరడం, ప్రజా ఆస్తులను ధ్వంసం చేయడం వంటి పనుల ద్వారా ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారని ప్రశ్నించింది. ఇది క్షమార్హం కాదని పేర్కొన్న సుప్రీం.. సభ్యుల వికృత ప్రవర్తనపై కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది. 2015లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కేరళ అసెంబ్లీలో జరిగిన ఘర్షణకు సంబంధించి దాఖలైన క్రిమినల్ కేసుపై వాదనలు విన్న ధర్మాసనం.. సభ మర్యాదను తప్పక కాపాడాలని వ్యాఖ్యానించింది. ఈ సభలను ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే వేదికలుగా అభివర్ణించింది.
అయితే, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్థిక మంత్రికి వ్యతిరేకంగా ఎమ్మెల్యేలు నిరసన చేపట్టారని ఓ న్యాయవాది వాదించారు.. ఆయన వ్యాఖ్యలతో విభేదించిన ధర్మాసనం.. ఆ సమయంలో నిరసన కన్నా.. ఆర్థిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టడమే అత్యంత ఆవశ్యకమని పేర్కొంది. కాగా, 2015 మార్చి 13న కేరళ అసెంబ్లీలో రసాభాస జరిగింది. విపక్ష ఎల్డీఎఫ్ సభ్యులు.. అప్పటి ఆర్థిక మంత్రి కేఎం మణి ప్రవేశపెట్టే బడ్జెట్‌ను అడ్డుకున్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన.. బడ్జెట్ ప్రవేశపెట్టకూడదని డిమాండ్ చేశారు. స్పీకర్ ఛైర్‌ను పోడియం నుంచి విసిరేశారు. ప్రిసైడింగ్ అధికారి కూర్చునే చోట ఉండే కంప్యూటర్లు, కీబోర్డులు, మైకులను ధ్వంసం చేశారు. దీనిపై పలువురు ఎల్డీఎఫ్ ఎమ్మెల్యేలపై కేసు నమోదైంది. మరి సుప్రీంకోర్టు వ్యాఖ్యలతోనైనా మన నేతల ప్రవర్తనలో మార్పు వస్తుందేమో చూడాలి.