నోట్ల కట్టల వ్యవహారం కేసు నుంచి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్ తప్పుకున్నారు. ఇందుకోసం ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. హైకోర్టు న్యాయమూర్తిగా తనను తొలగించాలని మాజీ సీజేఐ సంజీవ్ ఖన్నా చేసిన సిఫార్సు రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలని జస్టిస్ యశ్వంత వర్మ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయాన్ని జస్టిస్ వర్మ తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ అత్యవసర విచారణ కోసం సీజేఐ ముందు ప్రస్తావించారు. ‘‘నేను కూడా కమిటీలో సభ్యుడిని కాబట్టి ఈ కేసును విచారించడం నాకు సాధ్యం కాదు. మేము దానిని జాబితా చేస్తాము.’’ అని సీజేఐ గవాయ్ అన్నారు. జస్టిస్ యశ్వంత్ వర్మ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించడానికి ఒక బెంచ్‌ను ఏర్పాటు చేస్తామని సుప్రీంకోర్టు బుధవారం తెలిపింది.
ఇది కూడా చదవండి: HHVM : వామ్మో.. పవన్ స్టార్ రంగంలోకి దిగితే ఇలా ఉంటుందా
మార్చి 15న వర్మ ఇంట్లో అగ్నిప్రమాదం జరిగింది. మంటలార్పేందుకు వెళ్లిన ఫైర్ సిబ్బందికి అట్టపెట్టెల్లో నోట్ల కట్టలు కనిపించాయి. అవి దాదాపుగా రూ.15 కోట్లు ఉంటాయని అధికారులు భావించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను అగ్నిమాపక సిబ్బంది పైఅధికారులకు పంపించారు. ఆ ఫొటోలను అప్పటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఖన్నాకు పంపించారు. అనంతరం సుప్రీంకోర్టు.. విచారణ ప్యానెల్ ఏర్పాటు చేసింది. విచారణ అనంతరం జస్టిస్ వర్మ దుష్ప్రవర్తనకు పాల్పడ్డారని నిర్ధారించింది. దీంతో అప్పటి ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా .. వర్మపై అభిశంసన ప్రక్రియను ప్రారంభించాలని పార్లమెంట్‌ను కోరారు. ఈ నేపథ్యంలో వర్మను పదవి నుంచి తొలగించడానికి పార్లమెంట్లో అభిశంసన తీర్మానం తీసుకురావాలని కేంద్రం యోచిస్తోంది.
ఇది కూడా చదవండి: India-Pakistan: అప్పుల కోసం పరుగులు పెడుతోంది.. యూఎన్‌లో పాక్‌పై భారత్ వ్యంగ్యాస్త్రాలు
అయితే ఇంట్లో దొరికిన నగదుతో తనకు ఎలాంటి సంబంధం లేదని వర్మ తెలిపారు. తనపై, తన కుటుంబ సభ్యులపై వచ్చిన ఆరోపణలు నిరాధారం అని ఖండించారు. ఇందులో ఏదో కుట్ర జరిగిందని పేర్కొన్నారు. ప్యానెల్ ఇచ్చిన రిపోర్టును సవాల్ చేస్తూ వర్మ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం ఈ విచారణ నుంచి చీఫ్ జస్టిస్ గవాయ్ తప్పుకున్నారు. ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.