కరోనా కారణంగా టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలని సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. అయితే ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి పిటిషన్‌లు విద్యావ్యవస్థలో గందరగోళానికి గురిచేస్తాయంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తూ.. ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ తరహా పిటిషన్‌లు విద్యార్థులను తప్పుదోవ పట్టించే అవకాశాలు ఉన్నాయని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఖాన్విల్కర్ వ్యాఖ్యానించారు.
కరోనా నేపథ్యంలో క్లాసులు సరిగ్గా జరగని కారణంగా సీబీఎస్‌ఈ పరీక్షలతో పాటు టెన్త్, ఇంటర్ పరీక్షలను రద్దు చేయాలంటూ పలు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తున్నారు. దీంతో తాజాగా దాఖలైన పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు.. ఇలాంటి తరహా పిటిషన్‌లు దాఖలు చేయడం సంప్రదాయం కాకూడదని అభిప్రాయపడింది. పరీక్షలకు సంబంధించి ఇప్పటికే బోర్డులు షెడ్యూల్‌ను ప్రకటించడానికి ప్రయత్నిస్తున్నాయని.. ఇలాంటి సమయంలో షెడ్యూల్‌లో ఏవైనా సమస్యలు ఉంటే ఆయా బోర్డుల అధికారులను సంప్రదించాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఖాన్విల్కర్ సూచించారు.