Supreme Court: ఎలక్షన్ కమిషనర్ల నియామకాన్ని తాత్కాలికంగా నిలిపేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇద్దరు ఎన్నికల కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, సుఖ్‌బీర్ సింగ్ సంధుల నియామకంపై స్టే విధించేందుకు అంగీకరించలేదు. దీనిపై వచ్చే వారం కోర్టు విచారణ చేపట్టనుంది. మాజీ ఐఏఎస్ అధికారులైన ఇద్దరిని ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ నిన్న ఎంపిక చేసింది. ఫిబ్రవరి 14న అనూప్ చంద్ర పాండే పదవి విరమణ చేయడం, మార్చి 8న అరుణ్ గోయెల్ ఎలక్షన్ కమిషన్లుగా రాజీనామా చేయడంతో ఏర్పడిన ఖాళీలను వీరితో భర్తీ చేసింది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్‌కి కొత్త కమిషనర్లు సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో సాయపడనున్నారు.
Read Also: Supreme Court: ఎన్నికల కమిషనర్ల నియామకాన్ని నిలిపివేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ..
జ్ఞానేష్ కుమార్ ఫిబ్రవరిలో సహకార మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా పదవీ విరమణ చేయగా, సుఖ్‌బీర్ సింగ్ సంధు ఉత్తరాఖండ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఈ రోజు ఎలక్షన్ కమిషనర్లుగా వీరిద్దరు బాధ్యతలు చేపట్టారు. మరోవైపు రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఈసీ ప్రెస్‌మీట్ నిర్వహించనుంది. ఈ సమావేశంలో లోక్‌సభ ఎన్నికలతో పాటు 4 రాష్ట్రాల ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించనుంది. ఎంపీ ఎన్నికలతో పాటు ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. 2019లో మార్చి 10 లోక్‌సభ ఎన్నికలను ప్రకటించి, ఏప్రిల్ 11 నుంచి ఏడు దశల్లో దేశవ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించి, మే 23న ఓట్ల లెక్కింపు చేపట్టారు.