CAPF: ఎక్కువ గంటలు డ్యూటీ చేయడం, నిద్రలేమి కారణంగా సెంట్రల్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్(సీఏపీఎఫ్)లో విధులు నిర్వర్తిస్తున్న జవాన్‌లు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు, సర్వీస్ పూర్తి కాకముందే స్వచ్ఛంద పదవీ విరమణ కూడా చేస్తున్నారు. 730 మంది జవాన్లు ఆత్మహత్యలు చేసుకున్నారని, 55,000 మందికి పైగా రాజీనామా లేదా స్వచ్ఛంద పదవీ విరమణ చేశారని హోం మంత్రిత్వ శాఖ రాజ్యసభలో చెప్పింది.
Read Also: Kadambari Jethwani Case: ముంబై నటి జత్వాని కేసులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు..
ప్రధానంగా జవాన్ల ఆత్మహత్యలకు వ్యక్తిగత కారణాలే కారణమని, చాలా వరకు ఆత్మహత్యలు సిబ్బంది ఇంటికి వెళ్లి వచ్చిన తర్వాతే చోటు చేసుకున్నాయని, సీఏపీఎఫ్ సిబ్బంది ఆత్మహత్యలను ఆధ్యయనం చేసిన టాస్క్‌ఫోర్స్ వెల్లడించింది. 80 శాతానికి పైగా ఇలాగే ఆత్మహత్యలు జరిగినట్లు తెలిపింది. “ప్రధానంగా జీవిత భాగస్వామి లేదా కుటుంబ సభ్యుల మరణం, వైవాహిక విభేదాలు లేదా విడాకులు, ఆర్థిక ఇబ్బందులు, పిల్లలకు సరిపోని విద్యావకాశాలు కారణంగా ఉన్నాయి” అని నివేదిక పేర్కొంది.
ఈ సమస్యల్ని పరిష్కరించడానికి సిబ్బందికి 100 రోజుల సెలవు విధానం సాయపడుతుందని, జవాన్లు తమ కుటుంబాలతో మరింత సమయం గడిపొచ్చని కేంద్ర హోం మినిస్ట్రీ తెలిపింది. 42,797 మంది జవాన్లు ఈ సెలవు విధానాన్ని ఉపయోగించారని రాజ్యసభకు వెల్లడించింది. ఈ ఏడాది అక్టోబర్ వరకు 6,302 మంది సిబ్బంది తమ కుటుంబంతో 100 రోజులు గడిపారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ రాజ్యసభలో తెలిపారు.2023లో 8636 మంది, 2021లో 7864 మంది ఈ విధానాన్ని ఉపయోగించుకున్నారు.