NTV Telugu Site icon

Suchir Balaji: సుచిర్‌ బాలాజీ మృతికి ముందు ఏం జరిగింది.. వెలుగులోకి ఫొటో!

Suchirbalaji

Suchirbalaji

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిశోధకుడు. ఓపెన్ ఏఐ మాజీ ఉద్యోగి సుచిర్‌ బాలాజీ మరణం మిస్టరీగానే మిగిలిపోయింది. గతేడాది అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. అయితే సుచిర్‌ బాలాజీ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. ఈ వాదనను అతడి తల్లిదండ్రులు తోసిపుచ్చారు. కచ్చితంగా ఇది హత్యేనని వాదించారు. మరణంపై దర్యాప్తు చేయాలని అమెరికా ప్రభుత్వాన్ని.. భారత రాయబార కార్యాలయానికి విజ్ఞప్తి చేశారు. అయినా ఎలాంటి ప్రయోజనం దక్కలేదు. బాలాజీ ఆత్మహత్య చేసుకున్నాడని ఇటీవల పోలీసులు కేసును కూడా క్లోజ్ చేసేశారు.

తాజాగా సుచిర్‌ బాలాజీకి చెందిన ఒక ఫొటోను తల్లి పూర్ణిమారావు విడుదల చేసింది. మరణానికి ముందు సీసీటీవీలో రికార్డైన ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ ఫొటోలో బాలాజీ ఫుడ్ పార్శిల్ పట్టుకుని లిఫ్ట్ దగ్గర నిలబడిన దృశ్యం వెలుగులోకి వచ్చింది. ఈ ఫొటోలో బాలాజీలో ఎలాంటి ఆందోళన గానీ.. ఆత్మహత్య చేసుకునే టెన్షన్ గానీ అతడిలో ఎక్కడా కనిపించలేదు. నార్మల్‌గానే కనిపించాడు. ఇదిలా ఉంటే ఈ ఒక్క లిఫ్ట్ దగ్గరే సీసీ కెమెరా పని చేస్తోందని.. మిగతా చోట్ల సీసీకెమెరాలు సరిగ్గా పని చేయడం లేదని తెలుస్తోంది. అందుకే మిగతా ఎక్కడా కూడా బాలాజీ కనిపించలేదు. దీంతో తల్లి పూర్ణిమారావు మరింత అనుమానాలు రేకెత్తించారు. సుచిర్ చనిపోయిన రోజు రాత్రి 7:30 గంటల సమయంలో రికార్డైన ఫొటో అని తెలిపారు. అతడు చనిపోయిన 3 రోజుల తర్వాత నిర్వహించిన శవపరీక్షలో డ్రగ్‌ మోతాదు ఎక్కువగా ఉందని తెలిపారని.. కానీ తాము చేయించిన రిపోర్టులో మాత్రం అది తప్పని తేలిందని చెప్పారు. దీనిపై టాక్సికాలజిస్ట్ నివేదిక కోసం ఎదురుచూస్తున్నట్లు పూర్ణిమారావు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా అతడు నివసించే అపార్టుమెంటు గ్యారేజీలో, ఎలివేటర్‌లో ఎలాంటి సీసీటీవీలు లేవని, వాటి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నా అవి పనిచేయడం లేదని ఆమె తెలిపారు.

సుచిర్ బాలాజీ… చాట్‌జీపీటీ సంస్థ ‘ఓపెన్‌ ఏఐ’లో ఉద్యోగిగా ఉన్నారు. అయితే ఓపెన్ ఏఐ సమాజానికి హానికరం అంటూ తీవ్ర విమర్శలు చేసి తప్పుకున్నారు. అందులోంచి బయటకు వచ్చిన కొంత కాలానికే నవంబర్ 26న అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో తన అపార్ట్‌మెంట్‌లో బాలాజీ విగతజీవిగా మారిపోయాడు. హఠాత్తుగా బాలాజీ ప్రాణాలు కోల్పోవడం టెక్ ప్రపంచాన్ని కలవరపాటుకు గురి చేసింది. అయితే పోలీసులు.. బాలాజీ ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు తేల్చి చేతులు దులుపుకున్నారు.

సుచిర్‌ బాలాజీ.. నాలుగేళ్ల పాటు ఓపెన్‌ ఏఐలో పరిశోధకుడిగా పనిచేశారు. గత ఆగస్టులో ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆ సందర్భంగా ఓపెన్‌ ఏఐతో లాభం కంటే.. హానికరమే ఎక్కువ అని ఆరోపించాడు. అంతేకాకుండా చాట్‌జీపీటీ కాపీరైట్‌ చట్టాలను ఉల్లంఘించిందని ఆరోపించాడు. వ్యక్తుల, వ్యాపార సంస్థల రాబడి అవకాశాలను చాట్‌జీపీటీ, ఇతర చాట్‌బాట్‌లు ధ్వంసం చేస్తున్నాయని పేర్కొన్నారు. ఇక 2022లో కాపీరైట్‌ ఉల్లంఘనలకు సంబంధించి అనేక పిటిషన్లు ‘ఓపెన్‌ఏఐ’పై దాఖలయ్యాయి. ఈ కేసుల్లో బాలాజీ సాక్ష్యం కీలకం కానున్న నేపథ్యంలో అతడి ప్రాణాలు కోల్పోవడం తీవ్ర అనుమానాలకు తావిచ్చింది.