Vimal pan masala: విమల్ పాన్ మసాలా యాడ్ ద్వారా తప్పుదారి పట్టించే విధంగా ఉందని జైపూర్‌కు చెందిన జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార వేదిక (GIP) బాలీవుడ్ నటులు షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్, టైగర్ ష్రాఫ్‌లతో పాటు JB ఇండస్ట్రీస్ ఛైర్మన్‌కు నోటీసులు జారీ చేసింది. ప్రొడక్ట్‌లోని ప్రతీ గింజలో కుంకుమ పువ్వు ఉందని ప్రకటన ఇవ్వడం ద్వారా తప్పుదారి పట్టిస్తున్నట్లు ఆరోపించింది. ఈ ఆందోళనల్ని పరిష్కరించడానికి వ్యక్తిగతంగా లేదా ప్రతినిధి ద్వారా మార్చి 19న హాజరు కావాలని ఫోరం బాలీవుడ్ స్టార్లకు సమన్లు జారీ చేసింది.
Read Also: Home Minister Anitha: మహిళలపై ఆధారపడి ప్రస్తుతం ప్రభుత్వాలు నడుస్తున్నాయి..
ధరలో భారీ వ్యత్యాసం ఉన్నప్పటికీ, ప్రకటనలో సాఫ్రాన్ ఉందని సూచించడం ద్వారా తప్పుగా సూచిస్తున్నారని వాదిస్తూ జైపూర్ నివాసి యోగేంద్ర సింగ్ బడియాల్ ఫిర్యాదు చేయడంతో ఈ కేసు నమోదైంది. “దానే దానే మే హై కేసర్ కా దమ్ (ప్రతి గింజకు కుంకుమపువ్వు బలం ఉంటుంది)” అనే ట్యాగ్‌లైన్ వివాదానికి కేంద్రబిందువుగా ఉంది. కుంకుమ పువ్వు ధర కిలోగ్రాముకు దాదాపుగా రూ. 4 లక్షల ఉంటుందని పాన్ మసాలా కేవలం రూ. 5కే అమ్ముడవుతుందని, నిజమైన కుంకుమ పువ్వు లేదా దాని సువాసన కూడా విమల్‌లో ఉండే అవకాశం చాలా తక్కువగా ఉందని పిటిషనర్ హైలెట్ చేశాడు.
గైర్సిలాల్ మీనా అధ్యక్షతన సభ్యురాలు హేమలతా అగర్వాల్ నేతృత్వంలోని ఫోరం, ఫిర్యాదును పరిగణనలోకి తీసుకుని, నటులకు, కంపెనీ ఛైర్మన్‌కు నోటీసులు జారీ చేసింది. ఫిర్యాదుదారుడు వారు తప్పుడు వాదనలను ప్రచారం చేస్తున్నారని, ఉత్పత్తిని ఆమోదించడం ద్వారా వినియోగదారులను తప్పుదారి పట్టించారని ఆరోపించారు. ఈ ప్రకటన తప్పుడు ప్రచారాన్ని వ్యాపింపజేస్తుందని ఆరోపిస్తూ, దానిపై నిషేధం విధించాలని కూడా ఆయన కోరారు.