నైరుతి రుతుపవనాలు మంగళవారం దేశమంతటా విస్తరించినట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. సాధారణంగా జులై 8న నైరుతి రుతుపవనాలు దేశమంతటికీ విస్తరిస్తుంటాయి. నైరుతి రుతుపవనాల ప్రభావంతో చిట్టచివరిగా వర్షాలు కురిసే రాజస్థాన్‌లోని జైసల్మేర్, గంగానగర్‌కు వర్షాలు విస్తరించినప్పటికీ ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో మాత్రం మొహం చాటేశాయి. కాగా, మంగళవారం ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో కూడా వర్షాలు పడడంతో నైరుతి రుతుపవనాలు దేశమంతటా విస్తరించినట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. సాధారణంగా జూన్ 1న రావాల్సి ఉన్న నైరుతి రుతుపవనాలు జూన్ 3న కేరళ తీరాన్ని తాకాయి. అయితే వేగంగానే దేశంలోని ఇతర ప్రాంతాలకు వ్యాపించాయి. కాగా పలు నగరాల్లో భారీ వర్షం కురిసింది. రోడ్లపై భారీగా వర్షపు నీరు నిలవడంతో.. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ వర్షపాతం రానున్న ముందు మూడు రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.