Site icon NTV Telugu

Karnataka: కర్ణాటక సర్కార్ సంచలన నిర్ణయం.. 16 లోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్

Karnataka

Karnataka

కర్ణాటకలో సిద్ధరామయ్య సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకంపై నిషేధం విధించింది. ఈ మేరకు అసెంబ్లీలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు. పిల్లల్లో పెరుగుతున్న మొబైల్ వినియోగం, సోషల్ మీడియా వ్యసనం, ఆన్‌లైన్ భద్రతా సమస్యల నేపథ్యంలో 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగాన్ని నిషేధిస్తున్నట్లు కర్ణాటక ప్రభుత్వం తెలిపింది. ఈ విషయాన్ని శుక్రవారం 2026–27 రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ సిద్ధరామయ్య ప్రకటించారు. పిల్లలపై అధిక స్క్రీన్ టైమ్ ప్రభావాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

దేశంలో పిల్లలపై సోషల్ మీడియా బ్యాన్ వేసిన తొలి రాష్ట్రంగా కర్ణాటక నిలిచింది. ఇదే అంశంపై ఆంధ్రప్రదేశ్, గోవా రాష్ట్రాలు కూడా ఆలోచన చేస్తున్నాయి. ఇంతలోనే కర్ణాటక నిర్ణయం తీసుకుని ప్రకటించేసింది. సోషల్ మీడియా వినియోగంపై నియంత్రణ అవసరమనే చర్చ ప్రపంచవ్యాప్తంగా జరుగుతోంది. ఆస్ట్రేలియా ఇప్పటికే చిన్నారుల సోషల్ మీడియా వినియోగంపై కఠిన నియమాలు అమలు చేస్తోంది. బ్రిటన్, ఫిన్లాండ్ వంటి దేశాలు కూడా ఇలాంటి చర్యలను పరిశీలిస్తున్నాయి. అలాగే ఫ్రాన్స్, స్పెయిన్ వంటి యూరప్ దేశాల్లో పాఠశాలల్లో మొబైల్ ఫోన్ వినియోగంపై పరిమితులు విధించి విద్యార్థుల దృష్టి, చదువుపై ప్రభావం తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నాయి.

సోషల్ మీడియా వినియోగాన్ని నియంత్రించే అంశం కొంతకాలంగా కర్ణాటక ప్రభుత్వంలో చర్చలో ఉంది. రాష్ట్ర ఐటీ, బయోటెక్నాలజీ మంత్రి ప్రియాంక్ ఖర్గే అసెంబ్లీలో మాట్లాడుతూ.. యువతలో సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగాన్ని బాధ్యతగా ఉంచే చర్యలను పరిశీలిస్తున్నామని తెలిపారు. ఇక ఆరోగ్య మంత్రి దినేష్ గుండు రావు కూడా మాట్లాడుతూ.. పిల్లల్లో అధిక స్క్రీన్ టైమ్ వల్ల కలిగే సమస్యలపై ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే బీజేపీ ఎమ్మెల్యే సురేష్ కుమార్ స్పందిస్తూ. ఈ అంశాన్ని ప్రభుత్వం సీరిఎస్‌గా తీసుకోవాలని సూచించారు.

నిపుణుల అంచనా..
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. సోషల్ మీడియాను పూర్తిగా నిషేధించడం అంత సులభం కాదని అభిప్రాయపడ్డారు. 2025–26 ఆర్థిక సర్వే ప్రకారం యువతలో అధిక స్మార్ట్‌ఫోన్ వినియోగం వల్ల నిద్రలేమి, ఆందోళన, చదువుపై దృష్టి తగ్గడం వంటి సమస్యలు పెరుగుతున్నాయని పేర్కొంది. పిల్లలు సోషల్ మీడియాలో తమ వ్యక్తిగత సమాచారాన్ని తెలియకుండా పంచుకోవడం వల్ల గోప్యత సమస్యలు, సైబర్ నేరాలు పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆన్‌లైన్ గ్రేమింగ్ వంటి ప్రమాదాలు కూడా పెరుగుతున్నాయని పేర్కొంది. అయితే సోషల్ మీడియా పూర్తిగా ప్రతికూలం కాదని.. చాలా మంది విద్యార్థులకు ఇది విద్యా వనరులు, కోడింగ్ కమ్యూనిటీలు, సృజనాత్మక అవకాశాలు, వ్యాపార అవకాశాలను కూడా అందిస్తుందని అభిప్రాయపడ్డారు. అందుకే నిపుణులు పూర్తి నిషేధం కంటే వయస్సు పరిమితులు, పేరెంటల్ కంట్రోల్స్, డిజిటల్ అవగాహన కార్యక్రమాలు వంటి మధ్యంతర మార్గాలను అనుసరించడం మంచిదని సూచిస్తున్నారు. కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం.. దేశవ్యాప్తంగా సోషల్ మీడియా నియంత్రణపై మరింత చర్చకు దారి తీసే అవకాశం ఉంది.

Exit mobile version