కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ, తమిళనాడు మాజీ బీజేపీ అధ్యక్షుడు అన్నామలైకు ప్రమోషన్ దక్కే ఛాన్సుంది. బీజేపీ అధిష్టానం వారిద్దరిని పెద్దల సభకు పంపాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కూటమిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపాలని చర్చలు జరిగినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
త్వరలో ఏపీలో రాజ్యసభకు ఉప ఎన్నిక జరగనుంది. అక్కడ నుంచి స్మృతి ఇరానీ లేదా అన్నామలై పోటీ చేసే అవకాశం ఉందని వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వం ఉంది. దీంతో వారిద్దరిలో ఒకరిని పంపించాలని చూస్తున్నారు. ఇక మంగళవారం ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఏపీ సీఎం చంద్రబాబు కలవనున్నారు. ఈ సందర్భంగా చర్చకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇటీవలే తమిళనాడు పర్యటనలో ఉన్న అమిత్ షా.. అన్నామలైను ఢిల్లీకి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగానే అన్నామలైను పెద్దల సభకు పంపించాలని ఆలోచన చేస్తున్నారు. అంతేకాకుండా త్వరలోనే కేబినెట్ విస్తరణ కూడా జరగనుంది. అయితే ఈసారి కొత్త ముఖాలకు చోటు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా త్వరలో బీహార్, తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో యువతకు పెద్ద పీట వేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
స్మృతి ఇరానీ గతేడాది జరిగిన లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల్లో అమేథీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
కాంగ్రెస్ అభ్యర్థి కిషోరి లాల్ శర్మ చేతిలో 1.6 లక్షలకు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2019లో మాత్రం రాహుల్‌గాంధీని ఓడించి కేంద్రమంత్రయయారు. అమేథీలో ఓడిపోయిన దగ్గర నుంచి ఆమె ప్రభావం పెద్దగా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో రాజ్యసభకు పంపించి.. అనంతరం కేబినెట్‌లోకి తీసుకోవాలని హైకమాండ్ ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది.
2028, జూన్‌లో విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వం ముగుస్తోంది. అయితే ఆయన ముందుగానే జనవరిలో రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అంతేకాకుండా రాజకీయాల నుంచి తప్పుకున్నారు. దీంతో ఈ స్థానానికి మే 9న రాజ్యసభ ఉప ఎన్నిక జరగనుంది. ఈ సీటును స్మృతి ఇరానీకి లేదా అన్నామలైకు ఇచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. మే 9న జరగనున్న ఉప ఎన్నికకు నోటిఫికేషన్ ఇప్పటికే విడుదలైంది. నామినేషన్లకు చివరి తేదీ ఏప్రిల్ 29. మరికొన్ని రోజులే మిగిలి ఉండడంతో ఈరోజు ఏదొక విషయం తేలిపోనుంది.