కర్నాటకలోని పవిత్ర పుణ్యక్షేత్రం ధర్మస్థల.. పశ్చిమ కనుమల్లోని ఈ ప్రాంతం మంజునాథ స్వామి ఆలయంతో ఆధ్యాత్మిక కేంద్రంగా వెలుగొందుతుంది. నిత్యం వేలాదిమంది భక్తులు ఇక్కడ స్వామి దర్శనం కోసం తరలివస్తారు. కానీ, ఈ పవిత్ర భూమి ఇప్పుడు భయంకర ఆరోపణలతో కలకలం రేపుతోంది. రెండు దశాబ్దాలుగా వందలాది మంది హత్యకు గురయ్యారని, లైంగిక వేధింపులు జరిగాయని ఓ పారిశుద్ధ్య కార్మికుడు చేసిన ఫిర్యాదు దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ హత్యల వెనుక ఎవరున్నారు? ఇన్నాళ్లూ ఈ రహస్యం ఎలా దాగి ఉంది? కర్నాటక ప్రభుత్వం ఏం చేస్తోంది?
ధర్మస్థలలో వందలాది మంది హత్యకు గురయ్యారు.. ఆ శవాలను స్వయంగా తానే ఖననం చేశానని ఓ పారిశుద్ధ్య కార్మికుడు షాకింగ్ ఆరోపణలు చేశాడు. ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. మంజునాథ ఆలయంలో 1995 నుంచి 2014 వరకు పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసిన ఒక వ్యక్తి, జులై 3న దక్షిణ కన్నడ జిల్లా పోలీసులకు భయంకరమైన ఫిర్యాదు చేశాడు. తన 20 ఏళ్ల సర్వీసులో, వందలాది శవాలను తాను ఖననం చేశానని, కొన్నిటిని డీజిల్ ఉపయోగించి కాల్చానని వెల్లడించాడు. ఈ శవాల్లో ఎక్కువగా మహిళలు, మైనర్ బాలికలు ఉన్నారని, వారిపై లైంగిక వేధింపులు, యాసిడ్ దాడులు జరిగాయని ఆరోపించాడు. “నాకు ఇష్టం లేకపోయినా, నాతో బలవంతంగా ఈ పని చేయించారు. నోరు విప్పితే చంపేస్తామని బెదిరించారు,” అని అతను పోలీసులకు చెప్పాడు. నేత్రావతి నదీ తీరంతో పాటు, ఆలయం సమీపంలోని అడవుల్లో ఈ శవాలను ఖననం చేశానని, కొన్ని సందర్భాల్లో శవాలను నదిలో విసిరేశానని వెల్లడించాడు.
Also Read:Mohan Babu: నా మార్పుకు కారణం రజినీకాంత్..
సంచలనం కలిగించిన కార్మికుడి ఫిర్యాదు
ఈ హత్యల వెనుక ఆలయ నిర్వాహకుల్లో కొందరు శక్తివంతమైన వ్యక్తులు ఉన్నారని ఈ కార్మికుడు ఆరోపిస్తున్నాడు. దీంతో శవాలను ఖననం చేయమని ఆదేశించిన వారు ఎవరు? ఈ రహస్యం ఇన్నాళ్లూ ఎలా దాగింది? అనేది సంచలనం కలిగిస్తోంది. ఆలయంలోని పెద్దల ఆదేశాల మేరకే తాను ఈ దారుణాలకు పాల్పడినట్లు పారిశుద్ధ్య కార్మికుడు చెప్పాడు. “నీవు నోరు విప్పితే, నీ కుటుంబాన్ని కూడా ఇలాగే చంపేస్తాం,” అని బెదిరించారని వెల్లడించాడు. 1998లో ఒకసారి పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించినప్పుడు, తనను దారుణంగా కొట్టారని, ఆ తర్వాత నోరు మూసుకున్నానని చెప్పాడు. 2014లో తన కుటుంబంలో ఒక బాలికపై జరిగిన లైంగిక దాడి తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. అందుకే భయంతో ధర్మస్థల వదిలేసి పొరుగు రాష్ట్రానికి పారిపోయానట్లు తెలిపాడు. దశాబ్దం తర్వాత, అపరాధ భావంతో తిరిగి వచ్చినట్టు వెల్లడించారు. ఒక శవాన్ని వెలికితీసిన ఫోటోలను, తన ఉద్యోగానికి సంబంధించిన ఆధారాలను పోలీసులకు సమర్పించాడు.
పారిశుద్ధ్య కార్మికుడి ఆరోపణలు పోలీసులను కూడా ఉలిక్కిపడేలా చేశాయి. ఈ ఫిర్యాదు ఆధారంగా FIR నమోదు చేసిన పోలీసులు, దీనిపై సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నారు. జులై 4న ధర్మస్థల పోలీస్ స్టేషన్‌లో BNS కింద హత్య కేసు నమోదైంది. 1995 నుంచి 2014 వరకు, దాదాపు 20 ఏళ్ల కాలంలో 100 నుంచి 300 హత్యలు జరిగాయని కార్మికుడు ఆరోపించాడు. ఈ శవాల్లో ఎక్కువగా మహిళలు, మైనర్ బాలికలు ఉన్నారని, వారిపై లైంగిక వేధింపులు, యాసిడ్ దాడులు జరిగాయని చెప్పాడు. 2010లో 12-15 ఏళ్ల బాలికను ఆమె స్కూల్ బ్యాగ్‌తో ఖననం చేశానని తెలిపాడు. 2008లో ఒక 20 ఏళ్ల యువతి ముఖంపై యాసిడ్ పోసి, న్యూస్ పేపర్ లో చుట్టి డీజిల్‌తో కాల్చినట్లు వెల్లడించాడు.
ఇన్నాళ్లూ మౌనంగా ఎందుకున్నారు?
ఇంత భయానక దారుణాలను చూసిన ఈ కార్మికుడు 20 ఏళ్లపాటు ఎందుకు మౌనంగా ఉన్నాడనేది అంతు చిక్కట్లేదు. అయితే భయంతోనే ఇన్నాళ్లూ మౌనంగా ఉన్నానన్న కార్మికుడు, ఇప్పుడు అపరాధభావం భరించలేక ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. “నా జీవితం, కుటుంబం ప్రమాదంలో ఉందని బెదిరించారు. నోరు విప్పితే నన్ను కూడా ఖననం చేస్తామని హెచ్చరించారు,” అని పారిశుద్ధ్య కార్మికుడు పోలీసులకు చెప్పాడు. అందుకే తాను ఇన్నాళ్లూ నోరు విప్పలేదన్నారు. భయంతో ధర్మస్థల వదిలేసి వెళ్లిపోయినట్లు వివరించారు. అయితే ఇప్పుడు అపరాధ భావంతో బాధపడుతున్నానని, అందుకే తిరిగి వచ్చి ఫిర్యాదు చేశానని వెల్లడించారు. “ఈ శవాలకు సరైన అంత్యక్రియలు జరిగితే, వారి ఆత్మలు శాంతిస్తాయి. నా గుండెలోని భారం తగ్గుతుంది” అని పారిశుద్ధ్య కార్మికుడు వివరించారు. స్థానిక యాక్టివిస్టులు, జర్నలిస్టులు అతనికి ధైర్యం చెప్పడంతో కార్మికుడు ధైర్యం చేశారు.
మిస్సింగ్ కేసులపై ఫిర్యాదులు లేవా?
వందలాది మంది హత్యకు గురయ్యారంటే, వారి కుటుంబాలు ఎందుకు నోరు విప్పలేదు? ధర్మస్థలలో ఇన్ని మిస్సింగ్ కేసులు నమోదైతే ఇన్నాళ్లూ అవి ఎందుకు బయటకు రాలేదు? అనే ప్రశ్నలు ఇప్పుడు అందరినీ వెంటాడుతున్నాయి. పారిశుద్ధ్య కార్మికుడి ఫిర్యాదు తర్వాత, అందరి దృష్టి గత మిస్సింగ్ కేసులపైకి మళ్లింది. దక్షిణ కన్నడ పోలీస్ రికార్డుల ప్రకారం, 1995-2014 మధ్య దాదాపు 250 మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో ఆలయానికి వచ్చిన భక్తులు, స్థానిక గ్రామస్థులు, మైనర్ బాలికలు ఉన్నారు. అయితే, ఆధారాలు లేకపోవడంతో ఈ కేసులను మూసివేశారు. 2012లో 17 ఏళ్ల సౌజన్య అనే విద్యార్థిని లైంగిక దాడి, హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఆ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి 2023లో నిర్దోషిగా విడుదలయ్యాడు. 2003లో అనన్య భట్ అనే MBBS విద్యార్థిని మిస్సింగ్ కేసు కూడా ఇప్పుడు తిరిగి తెరపైకి వచ్చింది. ఆమె తల్లి సుజాత భట్ ఈ ఫిర్యాదు తర్వాత మళ్లీ కేసును తెరవాలని కోరింది.
మిస్సింగ్ కేసులు, హత్యలపై ఆందోళనలు
గతంలోనూ ధర్మస్థలలో అనుమానాస్పద మరణాలు, మిస్సింగ్ కేసులపై ఆందోళనలు జరిగాయి. కానీ అవన్నీ అణచివేయబడ్డాయి. దీంతో ఈ హత్యల వెనుక ఎవరో పెద్దలు ఉన్నారనే అనుమానాలు బలపడుతున్నాయి. ధర్మస్థలలో గతంలో అనేక ఆందోళనలు జరిగాయి. 2013లో సౌజన్య హత్య కేసుపై CPM నేతృత్వంలో పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి. కానీ పెద్దల ఒత్తిడితో అవి సద్దుమణిగాయి. 1987లో పద్మలత అనే 17 ఏళ్ల బాలిక హత్య కేసు దర్యాప్తు కూడా సరిగా సాగలేదు. సౌజన్య కేసులో ఆలయ నిర్వాహకుడు డాక్టర్ వీరేంద్ర హెగ్డే కుటుంబంపై ఆరోపణలు వచ్చాయి. కానీ అవి నిరూపణ కాలేదు. పారిశుద్ధ్య కార్మికుడు కూడా ఈ హత్యల వెనుక ఆలయంలోని శక్తివంతమైన వ్యక్తులు ఉన్నారని ఆరోపించాడు. అయితే ఆలయ ఆస్తులు, దానాల ద్వారా వచ్చే భారీ ఆదాయం, భూ వివాదాలు కొన్ని హత్యలకు కారణమై ఉండవచ్చని అనుమానిస్తున్నారు.
సిట్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం
ఈ భయానక ఆరోపణల తర్వాత కర్నాటక ప్రభుత్వం మేల్కొంది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT)ని ఏర్పాటు చేసింది. కానీ, ఈ దర్యాప్తుపై స్థానికుల్లో అనుమానాలు మాత్రం అలాగే ఉన్నాయి. జులై 19న కర్నాటక ప్రభుత్వం IPS అధికారి ప్రణవ్ మోహంతి నేతృత్వంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT)ని ఏర్పాటు చేసింది. నేత్రావతి నదీ తీరంతోపాటు ఆలయ పరిసరాల్లో తవ్వకాలు చేపట్టింది. సాక్షుల విచారణ ప్రారంభించింది. ఫోరెన్సిక్ ఆధారాలను సేకరిస్తోంది. కార్మికుడు ఇచ్చిన వాంగ్మూలం, సమర్పించిన ఆధారాల ఆధారంగా సిట్ దర్యాప్తు చేపట్టింది. అయితే, గతంలో సౌజన్య కేసులో పోలీసుల నిర్లక్ష్యం వహించడం, CCTV ఫుటేజీలు తొలగించడం లాంటివి పెద్దల జోక్యాన్ని సూచిస్తున్నాయి.
Also Read:Samantha : డేటింగ్ నుంచి వెడ్డింగ్ దాకా..సైలెంట్‌గా షాకిచ్చిన సమంత ?
దీంతో ఈ కేసు దర్యాప్తు సక్రమంగా సాగుతుందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. కర్ణాటక స్టేట్ విమెన్స్ కమిషన్ అధ్యక్షురాలు నాగలక్ష్మి చౌదరి, 20 ఏళ్లలో మిస్సింగ్ కేసులు, అసహజ మరణాలపై నివేదిక కోరారు. రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి V గోపాల గౌడ, SIT దర్యాప్తును జడ్జి పర్యవేక్షణలో నిర్వహించాలని డిమాండ్ చేశారు. ధర్మస్థల మాస్ మర్డర్స్ కేసు కేవలం ఆరోపణలతోనే ఆగిపోతుందా? లేక దశాబ్దాలుగా దాచిపెట్టిన భయంకర నిజాలు వెలుగులోకి వస్తాయా? ఈ ప్రశ్నలకు సమాధానం SIT దర్యాప్తులో తేలనుంది.