ప్రముఖ పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా దారుణ హత్యకు గురైన సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. అతడ్ని చంపింది తామేనని గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టడంతో.. ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌కి గోల్డీ బ్రార్ అత్యంత సన్నిహితుడు. దీంతో.. జైలు నుంచే బిష్ణోయ్ ఈ హత్యకు కుట్ర పన్ని ఉంటాడన్న అనుమానంతో పోలీసులు అతడ్ని రిమాండ్‌లోకి తీసుకొని, విచారించే చర్యలు మొదలుపెట్టారు.
కొన్ని రోజుల క్రితం ఢిల్లీ పోలీసులు షారుఖ్ అనే ఓ క్రిమినల్‌ని అరెస్ట్ చేశారు. అతడు మెసేజింగ్ యాప్ ద్వారా గోల్డీ బ్రార్‌తో సంభాషణ జరిపినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ నేపథ్యంలోనే బిష్ణోయ్, అతని అనుచరుల్ని ఢిల్లీ పోలీస్ ప్రత్యేక విభాగం ప్రశ్నిస్తోందని విశ్వసనీయ వర్గాల సమాచారం. అటు.. విక్కీ మిడ్డుఖేరా, గుల్రార్ బ్రార్ హత్యలో సిద్ధూ ప్రమేయం ఉందన్న విషయం తెలిసే.. అతడ్ని అంతమొందించామని గోల్డీ బ్రార్ తన ఫేస్‌బుక్ పోస్ట్‌లో వెల్లడించాడు. ఇంత జరిగినా, పోలీసులు ఏం చేసుకోలేకపోయారంటూ అతడు ఆ పోస్ట్‌లోనే వెల్లడించాడు కూడా! ఈ గోల్డీ బ్రార్ ప్రస్తుతం విదేశాల్లో (కెనడా) ఉన్నాడు.
కాగా.. ఆదివారం సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో సిద్ధూ తన స్నేహితులతో కలిసి కారులో వెళ్తుండగా, గుర్తు తెలియని వ్యక్తులు బుల్లెట్ల వర్షం కురిపించారు. 30 సార్లకు పైగా కాల్పులు జరిపారు. అతడు చనిపోయాడా? లేదా? అనేది నిర్ధారించుకొని, నిందితులు అక్కడి నుంచి పారిపోయినట్లు తెలుస్తోంది. సిద్ధూకి సొంతంగా బుల్లెట్ ప్రూఫ్ కారున్నా, దాన్ని వినియోగించలేదు. మరోవైపు.. తన కుమారుడి హత్యపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)తో దర్యాప్తు జరిపించాలని సిద్ధూ తండ్రి డిమాండ్ చేస్తున్నారు.