పంజాబ్ కాంగ్రెస్‌లో అంతర్గత కలహాలు ఓ కొలిక్కి వచ్చాయి. బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన సిద్దూ అనతి కాలంలోనే పార్టీలో మంచి పట్టు సాధించారు. అయితే, కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ తగాదాలు ఎక్కువయ్యాయి. పంజాబ్ ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్, సిద్దూ వర్గంగా విడిపోయి విమర్శలు చేసుకున్నారు. ఈ తగాదాలు చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రంగంలోకి దిగింది. సిద్దూకి కాంగ్రెస్ పీసీసీ పగ్గాలు అప్పగించింది. ముఖ్యమంత్రిగా అమరిందర్ సింగ్ కొనసాగనున్నారు. దీంతో పంజాబ్‌లో గొడవకు ప్రస్తుతానికి చెక్ పడినట్టే అని చెప్పుకోవచ్చు.
Read: పిసినారి సునీల్… ఇబ్బందుల్లో వెంకీ!
సిద్దూకు కీలక బాధ్యతలు అప్పగిస్తున్నారని పంజాబ్ వ్యవహారాల ఇంచార్జ్ హరీశ్ రావత్ ప్రకటించారు. రాష్ట్ర కాంగ్రెస్‌లో కీలక నేత సిద్ధూ అని, ఆయన ఇకనుంచైనా జాగ్రత్తగా మసలుకోవాలని హరీశ్ రావత్ సున్నితంగా హెచ్చరించారు. విద్యుత్ సంక్షోభం విషయంలో తలెత్తిన వివాదం చిలికి చిలికి గాలివానలా మారింది. సిద్ధూపై ముఖ్యమంత్రి బహిరంగంగా విమర్శలు చేశారు. అయినప్పటికీ సిద్దూకి పార్టీ పగ్గాలు అప్పగించడంపై అమరిందర్ సింగ్ వర్గం కొంత అసంతృప్తిగా ఉన్నది. రాబోయో రోజుల్లో ఈ ఇద్దరు నేతలు కలిసి పనిచేస్తారా? లేదా అన్నది చూడాలి.