మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ శరద్ పవార్ న్యాయ పోరాటానికి దిగారు. గడియారం గుర్తుపై సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. గడియారం గుర్తుతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ సుప్రీంకోర్టుకు తెలియజేశారు. త్వరలో జరగబోయే మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో గడియారం గుర్తును అజిత్ పవార్ వర్గం వాడుకోకుండా నిరోధించాలని కోరుతూ పిటిషన్ వేశారు. పార్టీ గుర్తు గడియారంతో తమకు ఎంతో అనుబంధం ఉందని, ఎన్నికల ప్రక్రియలో నిష్పాక్షికత, స్పష్టత కోసం, ఓటర్లలో అయోమయం నెలకొనకుండా అజిత్ వర్గం కొత్త గుర్తు కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆ పిటిషన్‌లో కోరారు.
ఇది కూడా చదవండి: Vizag Steel Plant: దిగొచ్చిన విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం.. విధుల్లోకి 4,200 మంది కార్మికులు
2024 లోక్‌సభ ఎన్నికల్లో ఓటర్లు గందరగోళానికి గురైన విషయాన్ని శరద్ పవార్ కోర్టు దృష్టికి తెచ్చారు. ఇదే గందరగోళం అసెంబ్లీ ఎన్నికల్లో కూడా నెలకొనే అవకాశం ఉందన్నారు. ఓటర్లను మభ్యపెట్టే వారిని నిరోధించేందుకు అజిత్ పవార్ మరో గుర్తును ఎంపిక చేసుకోవాలని అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు. అక్టోబర్ 15న ఈ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది. గత ఏడాది ఎన్సీపీని చీల్చి తన వర్గం ఎమ్మెల్యేలతో ఎన్డీయేలో చేరి డిప్యూటీ సీఎం పదవిని చేపట్టిన అజిత్ పవార్ వర్గాన్ని అసలైన ఎన్‌సీపీగా కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించింది. ఆ పార్టీ సంప్రదాయ గుర్తు ‘గడియారం’ను వారికే కేటాయించింది. త్వరలో ఎన్నికలు ఉన్నందును ఆ గుర్తును తమ పార్టీకే కేటాయించాలని శరద్ పవార్ న్యాయస్థానాన్ని కోరారు. దీనిపై ధర్మాసనం ఎలాంటి తీర్పును ఇస్తుందో వేచి చూడాలి.
ఇది కూడా చదవండి: KTR: కొండా సురేఖకు కేటీఆర్ లీగల్ నోటీసులు