నేషనల్ ఇన్వేస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) డైరెక్టర్ జనరల్ గా ఐపీఎస్ అధికారి దినకర్ గుప్తాను నియమించింది కేంద్ర ప్రభుతం. పంజాబ్ మాజీ డీజీపీ అయిన దినకర్ గుప్తాను ఎన్ఐఏ బాస్ గా నియామకాాల కమిటీ( ఏసీసీ) గురువారం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 1987 బ్యాక్ పోలీస్ సర్వీస్ కు చెందిన దినకర్ గుప్తా పంజాబ్ కేడర్ లో పనిచేశారు. గతేడాది ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ స్థానంలో సీఎంగా బాధ్యతలు తీసుకున్న చరణ్ జీత్ సింగ్ చన్నీ, డీజీపీగా ఉన్న దినకర్ గుప్తాను ఆ స్థానం నుంచి తొలగించి పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ కు మార్చారు.
ఏడాది కాలంగా దినకర్ గుప్తా సెంట్రల్ డిప్యూటేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. అమరిందర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో డీజీపీగా గుప్తా, ఐఏఎస్ అధికారి అయిన ఆయన భార్య వినీ మహజన్ పంజాబ్ సీఎస్ గా పని చేశారు. ఇటీవలే ఆమె జలశక్తి మంత్రిత్వ శాక కార్యదర్శిగా నియమితులయ్యారు. అమరిందర్ సింగ్ హాయాంలో ఈ జంట ‘‘ పవర్ ఫుల్ కపుల్’’ గా పేరు సంపాదించుకున్నారు. దినకర్ గుప్తా మార్చి 31, 2024 వరకు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఎన్ఐఏ చీఫ్ గా ఉంటారు.
ఇదిలా ఉంటే హోం మంత్రిత్వ శాఖ అంతర్గత భద్రత ప్రత్యేక కార్యదర్శిగా ఇంటెలిజెన్స్ బ్యూరో స్పెషల్ డైరెక్టర్ స్వాగత్ దాస్ ను నియమించింది కేంద్రం. ఛత్తీస్గడ్ కేడర్ 1987 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన స్వాగత్ దాస్ నవంబర్ 30, 2024 వరకు పదవిలో ఉండనున్నారు.