ఈనెల 26న జరగనున్న భారత గణతంత్ర వేడుకలను టార్గెట్‌గా చేసుకుని ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు నిఘా వర్గాలకు హెచ్చరికలు అందాయి. ఈ వేడుకలకు ప్రధాని మోదీ సహా ఇతర దేశాల నుంచి వచ్చే అతిథులపైనా ఉగ్రవాదులు దాడి చేసేందుకు ప్లాన్ చేసినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం వచ్చింది. ప్రసిద్ధ కట్టడాలు, జనాలు రద్దీగా ఉన్న ప్రాంతాలను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకునే అవకాశముందని ఇంటెలిజెన్స్ వర్గాలు నివేదించాయి. డ్రోన్‌ల ద్వారా ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉందని భద్రతా బలగాలు అనుమానం వ్యక్తం చేశాయి.
కాగా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ నేపథ్యంలో పంజాబ్ సహా ఇతర రాష్ట్రాలను భద్రతా బలగాలు అలర్ట్ చేశాయి. లష్కరే తోయిబా, ది రెస్టిస్టెన్స్ ఫోర్స్, జైషే మహమ్మద్, హర్కత్ ఉల్ ముజాహిదీన్, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి టెర్రరిస్ట్ గ్రూపులు దాడులకు పాల్పడేందుకు కుట్ర పన్నాయని ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. అంతేకాకుండా పాకిస్థాన్‌లోని ఖలిస్తాన్ గ్రూపులు కూడా పంజాబ్‌ను టార్గెట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని.. ఆ రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అలజడులు సృష్టించాలని పన్నాగం పన్నినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు పేర్కొన్నాయి. కాగా ఇటీవల పంజాబ్‌లో భద్రతా లోపం కారణంగా ప్రధాని మోదీ కాన్వాయ్ 20 నిమిషాల పాటు ఓ ఫ్లైఓవర్‌పై నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అయితే ప్రధాని పర్యటనలో ఎలాంటి భద్రత లోపం లేదని పంజాబ్ ప్రభుత్వం ప్రకటించింది.