ఉపరాష్ట్రపతి సీపీ.రాధాకృష్ణన్ తమిళనాడులో పర్యటిస్తున్నారు. ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన తర్వాత తొలిసారి సొంత రాష్ట్రంలో రాధాకృష్ణన్ పర్యటిస్తున్నారు. మూడు రోజుల పర్యటన కోసం మంగళవారం కోయంబత్తూరు చేరుకున్నారు. కోయంబత్తూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో బీజేపీ నాయకులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు.
ఇది కూడా చదవండి: Delhi High Court: ‘నువ్వు ఏడిస్తే.. నేను ఏడ్చేస్తా’.. కోర్టు వీడ్కోలు ప్రసంగంలో జడ్జి భావోద్వేగం
అయితే కోయంబత్తూరులో భద్రతా లోపం కనిపించింది. ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ కాన్వాయ్ వెళ్తుండగా ఎదురుగా ఇద్దరు యువకులు స్కూటర్ నడుపుకుంటూ వచ్చేశారు. దీంతో భద్రతా లోపం కొట్టొచ్చినట్లు కనబడింది. ఈ సంఘటనపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసుల నిర్లక్ష్యం వహించారంటూ మండిపడ్డారు. ఈ ఘటనపై వెంటనే దర్యాప్తు చేయాలని ఎమ్మెల్యే వనతి శ్రీనివాసన్ డిమాండ్ చేశారు. వీవీఐపీ భద్రతా నిబంధనలు మరింత కఠినంగా అమలు చేయాలని కోరారు.
ఇది కూడా చదవండి: Delhi Cloud Seeding: ఢిల్లీలో మేఘ మథనం ఫెయిల్.. కోట్లు కుమ్మరించినా పడని వాన చుక్క
కోయంబత్తూరులోని కోడిసియాలో కోయంబత్తూరు సిటిజన్ ఫోరం… రాధాకృష్ణన్‌కు ఘనంగా సత్కారం చేశారు. గార్డ్ ఆఫ్ ఆనర్ కూడా అందజేశారు. ఈ సందర్భంగా రాధాకృష్ణన్ మాట్లాడుతూ.. ప్రజల అభిమానానికి కృతజ్ఞతలు చెప్పారు. విక్షిత్ భారత్ సాధించడానికి సమిష్టి కృషి అవసరం అన్నారు. దేశ పురోగతికి ప్రతి ప్రాంతం కీలకమైన సహకారాన్ని అందించాలని కోరారు. కోయంబత్తూరుతో సుదీర్ఘ అనుబంధం ఉందని గుర్తుచేశారు. ఇక్కడి ప్రజల శ్రమశక్తి, ఔత్సాహిక స్వభావాన్ని ప్రశంసించారు. ఆ లక్షణాలే నగరాన్ని ఉత్సాహంగా, శక్తివంతంగా, సంపన్నంగా మార్చాయని కొనియాడారు. భారత్‌ను సంపన్న దేశంగా మార్చడానికి పరిశ్రమలు, తయారీ, వాణిజ్యం వృద్ధి అవసరమని చెప్పారు. విక్షిత్ భారత్ సాధించడానికి ప్రతి వ్యక్తి సహకరించాలని.. ఈ ప్రయాణంలో తమిళనాడు కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ఇక పర్యటనలో భాగంగా ఉపరాష్ట్రపతి కోయంబత్తూరులోని టౌన్ హాల్ కార్పొరేషన్ భవనాన్ని సందర్శించి జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఇది కూడా చదవండి: Trump Dance: జపాన్‌లోనూ మరోసారి డ్యాన్స్‌తో అదరగొట్టిన ట్రంప్.. వీడియో వైరల్
అటు తర్వాత కోయంబత్తూరులోని పేరూర్ మఠంలో జరిగిన శాంతలింగ రామసామి అడిగలర్ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఆధ్యాత్మిక విలువలను వ్యాప్తి చేయడంలో.. విద్యను ప్రోత్సహించడంలో.. క్రమశిక్షణ, సామరస్యపూర్వక సమాజాన్ని పెంపొందించడంలో అడిగలర్ జీవితాంతం చేసిన సేవలను రాధాకృష్ణన్ ప్రశంసించారు.
ఇక పర్యటనలో భాగంగా అక్టోబర్ 29న తిరుప్పూర్‌లో రాధాకృష్ణన్‌కు సన్మానం జరగనుంది. సాయంత్రం మధురై చేరుకుని మధురై మీనాక్షి అమ్మన్ ఆలయంలో ప్రార్థనలు చేస్తారు. అనంతరం అక్టోబర్ 30న రామనాథపురం జిల్లాలోని పసుంపొన్‌లో జరిగే పసుంపొన్ ముత్తురామలింగ తేవర్ జయంతి కార్యక్రమానికి హాజరవుతారు.