తమిళనాడు ఎన్నికల్లో అన్నాడీఎంకే పార్టీ పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఓటమి తరువాత, ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తామని, అభివృద్దికి డిఎంకే ప్రభుత్వానికి సహకరిస్తామని అన్నాడీఎంకే నేతలు చెబుతున్నారు. అయితే, అన్నాడిఎంకే పార్టీ ఓటమిపై మాజీనేత శశికళ కీలక వ్యాఖ్యలు చేసింది. తాను జైలు నుంచి విడుదలయ్యి బయటకు వచ్చిన సమయంలో విజయం కోసం కలిసి పనిచేద్దామని చెప్పానని, కానీ, పార్టీనేతలు పట్టించుకోలేదని, కలిపి పనిచేసి ఉంటే అమ్మ ప్రభుత్వం అధికారంలోనే ఉండేదని అన్నారు.
Read: కమల్ ‘విక్రమ్’ సెట్స్ లో ‘ఖైదీ’ నటుడు
అధికారంలో ఉండగా అమ్మ చేసిన సేవలను ప్రజలు ఎప్పటికీ మరిచిపోలేరని అన్నారు. కార్యకర్తలతో తిరిగి పనిచేస్తామని, తప్పకుండా వచ్చే ఎన్నికల నాటికి అన్నాడీఎంకేను విజయపథంలో నిలబెడతామని శశికళ పేర్కొన్నారు. అయితే, అన్నాడీఎంకే మాత్రం శశికళను పార్టీలోకి తీసుకోవడానికి ససేమిరా అంటున్నది. ఇప్పటికే ఆమెను బహిష్కరించామని, ఆమెతో సంబంధాలు కలిగిన నేతలపై చర్యలు తీసుకుంటామని పార్టీ నేతలు చెబుతున్నారు. పళనీ, పన్నీర్ సెల్వంతో కూడిన అన్నాడీఎంకే ఖచ్చితంగా బలంగా ఉందని, ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తారని అన్నాడీఎంకే నేతలు చెబుతున్నారు.