జగదీప్ ధన్‌ఖర్.. గత నెల 21న అనూహ్యంగా ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు. అనారోగ్య కారణాలతో పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఆనాటి నుంచి మళ్లీ ఎక్కడా ప్రత్యక్షం కాలేదు. అయితే ఆయన్ను కలిసేందుకు విపక్ష పార్టీలు ప్రయత్నించినా ప్రయోజనం లభించలేదు. దీంతో శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ ఆందోళన వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: Asim Munir: భారత్‌పై పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ మూర్ఖపు వ్యాఖ్యలు.. అవసరమైతే…!
మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్ ఆచూకీ తెలియజేయాలంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సంజయ్ రౌత్ లేఖ రాశారు. ధన్‌ఖర్ కలిసేందుకు ప్రయత్నించినా.. ఎక్కడున్నారో తెలియడం లేదని.. తమకు ఆచూకీ చెప్పాలని లేఖలో కోరారు.
ధన్‌ఖర్ ఎక్కడున్నారన్న దానిపై ఎలాంటి సమాచారం లేదని.. ప్రస్తుత లొకేషన్ ఏంటి? ఆయన ఆరోగ్యం ఎలా ఉంది? వంటి ప్రశ్నలపై స్పష్టత ఇవ్వాలని లేఖలో తెలిపారు. ధన్‌ఖర్‌తో మాట్లాడేందుకు కొంతమంది రాజ్యసభ సభ్యులు ప్రయత్నించినా ఎలాంటి ఫలితం లేకపోయిందన్నారు. ఆయనే కాదు.. ఆయన సిబ్బందిని కూడా ఇప్పటి వరకు సంప్రదించలేకపోతున్నామని పేర్కొన్నారు. ఇది చాలా ఆందోళనకరంగా ఉందన్నారు. అసలు ధన్‌ఖర్‌కు ఏం జరిగింది? ఆయన క్షేమంగానే ఉన్నారా? ఏమైనా జరిగిందా? ఈ ప్రశ్నలపై దేశ ప్రజలకు సమాధానం కావాలని సంజయ్ రౌత్ తన లేఖలో ప్రశ్నించారు. అమిత్ షాకు లేఖను ఆదివారం పంపించగా.. సోమవారం ఎక్స్ ఖాతాలో సంజయ్ రౌత్ పోస్ట్ చేశారు.
ఇది కూడా చదవండి: Karnataka: ఓ టూరిస్ట్ ఓవరాక్షన్.. సెల్ఫీ తీసుకుంటుండగా ఏనుగు దాడి
ధన్‌ఖర్ ఎక్కడున్నారో తెలుసుకునేందుకు సుప్రీంకోర్టులో కూడా హెబియస్ కార్పస్ పిటిషన్ వేయనున్నట్లు ఎంపీ సంజయ్ రౌత్ వెల్లడించారు. సుప్రీంకోర్టుకు వెళ్లేముందైనా కేంద్రం నుంచి సమాచారం కోరడం ఉత్తమమని భావిస్తున్నట్లు సంజయ్ రౌత్ తెలిపారు. దయచేసి మా ఆందోళనలను అర్థం చేసుకుని ధన్‌ఖర్ ఆచూకీ చెబుతారని విశ్వసిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. గతవారం పలువురు విపక్ష నేతలు కూడా ధన్‌ఖర్ సమాచారం కోసం కేంద్రాన్ని ప్రశ్నించడం విశేషం.
ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేశాక ధన్‌ఖర్‌ను కలిసేందుకు మల్లిఖార్జున ఖర్గే, శరద్‌పవార్, ఆప్ పార్టీకి చెందిన ఒక సీనియర్ నాయకుడు ప్రయత్నించారు. అయితే రాజీనామా చేసిన వెంటనే ధన్‌ఖర్ అధికారిక భవనాన్ని ఖాళీ చేసి వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఆయన ఎక్కడ ఉంటున్నారో ఎవరికి తెలియలేదు. ఈరోజు వరకు ఆయన ఆచూకీ లభించలేదు. అయితే ఆయన క్షేమంగా లేడని.. ఢిల్లీలో విపరీతంగా పుకార్లు నడుస్తున్నాయి. సురక్షితంగా లేడంటే.. ఏమైనా జరిగిందా? అన్నది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. తాజాగా సంజయ్ రౌత్ లేఖ తర్వాత మరింత ఆందోళన పెరుగుతోంది. దీనిపై కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి.
Hon.Home Minister
Shri @AmitShah ji
Jay hind! pic.twitter.com/uxAgRKPUKk— Sanjay Raut (@rautsanjay61) August 11, 2025