NTV Telugu Site icon

Sanjay Raut: సంజయ్ రౌత్.. 3 పార్టీలను ముంచాడు.. ముఖ్యంగా ఠాక్రేని..

Sanjay Raut

Sanjay Raut

Sanjay Raut: సంజయ్ రౌత్ ఇప్పుడు ఈ పేరు మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రధానంగా వినిపిస్తోంది. బీజేపీ మిత్రపక్షంగా ఉన్న శివసేన రెండుగా కావడానికి కారణం, ఇప్పుడు ఇంతటి పతనానికి కారణం అతనే అని ఠాక్రే కుటుంబ అభిమానులు, మద్దతుదారులు అనుకుంటున్నారు. అనవసరంగా ఉద్ధవ్ ఠాక్రేకి సీఎం ఆశలు కలిపించడంతో పాటు, ఆయన కొడుకు ఆదిత్యఠాక్రే, భార్య రష్మీ ఠాక్రేలపై కూడా ప్రభావం చూపించాడు. బాల్ ఠాక్రే ఉన్న సమయం నుంచి ప్రత్యక్ష రాజకీయాలకు ఠాక్రే కుటుంబం దూరం. తన ఇంటి నుంచి మహారాష్ట్ర రాజకీయాలు నడిచేవి, అయినా కూడా వారు ఎప్పుడూ కూడా పదవుల్ని ఆశించలేదు. శివసేన పార్టీ నుంచి నిజమైన శివసైనికులు మాత్రమే ఎమ్మెల్యేలుగా ఎన్నికై మహారాష్ట్ర అసెంబ్లీలో ఉండేవారు. వీరింతా బల్ ఠాక్రే మాటని జవదాటేవారు కాదు.

సీఎం పదవి ఆశ కొంప ముంచింది..

బాల్ ఠాక్రే శకం ముగిసిన తర్వాత 2019 వరకు బాగానే ఉన్న బీజేపీ-శివసేన బంధం, ఆ ఏడాది అసెంబ్లీ ఎన్నికల తర్వాత విడిపోయింది. నిజానికి 2019లో అమిత్ షా స్వయంగా ఉద్ధవ్ ఠాక్రే నివాసం మాతో శ్రీకి వచ్చి పొత్తుల గురించి చర్చించారు. అప్పుడు శివసేన పరిస్థితి అలా ఉండేది. ఎన్నికలు జరిగిన తర్వాత మెజారిటీ సీట్లు బీజేపీ గెలిచినప్పటికీ, తమకే సీఎం పదవి ఇవ్వాలని శివసేన పట్టుబట్టడంతో దశాబ్ధాల బంధం విడిపోయింది.

కాంగ్రెస్, ఎన్సీపీలతో శివసేన మహ వికాస్ అఘాడీ(ఎంవీఏ)పేరుతో పొత్తు పెట్టుకుని ఉద్ధవ్ ఠాక్రే సీఎం అయ్యారు. నిజానికి కఠినమైన హిందూ ఐడియాలజీని కలిగి ఉండే శివసేన, తమ భావజాలానికి విరుద్ధమైన కాంగ్రెస్, ఎన్సీపీలో చేరింది. ఈ ఎంవీఏ కూటమి, ఈ పొత్తు, సీఎం పదవి మొత్తం అన్నింటికి కర్త, కర్మ, క్రియ సంజయ్ రౌత్. నిజానికి శివసేనలో ఠాక్రే అధ్యక్షుడైనప్పటికీ, అతడి మౌత్ పీస్ మాత్రం సంజయ్ రౌత్. అంతలా పవర్ కలిగి ఉండేవాడు. బీజేపీని ప్రతీసారి విమర్శిస్తూ తనకు ఎదురులేదని భావించాడు. 2019 ఎన్నికల్లో 56 సీట్లు గెలిచిన తర్వాత సీఎంగా ఠాక్రే ప్రమాణస్వీకారం చేశారు. సరిగా 2.5 ఏళ్లలో ఏక్‌నాథ్ షిండే తిరుబాటులో శివసేన రెండు ముక్కలైంది. మెజారిటీ ఎమ్మెల్యేలు షిండే వైపు ఉండటంతో పార్టీ కూడా షిండే ఖాతాలోకి వెళ్లిపోయింది. బీజేపీ మద్దతుతో షిండే సీఎం అయ్యారు.

కాంగ్రెస్ ముందు మోకరిల్లేలా చేశాడు..

ఒకప్పుడు రాజకీయాల్లో కింగ్ మేకర్‌గా ఉండే ఠాక్రేని, ఇప్పుడు రాజకీయ పతనానికి సంజయ్ రౌత్ కారణమని చాలా మంది భావిస్తున్నారు. ఐడిలాజికల్‌గా విరుద్ధంగా ఉండే కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీని పదే పదే ప్రశంసించే రౌత్ తీరు నిజమైన శివసేన కార్యకర్తలు, హిందుత్వవాదులకు నచ్చలేదు. ఠాక్రే, రౌత్ ఇద్దరూ కూడా కాంగ్రెస్‌ సీట్ల కోసం అడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చిందని సగటు కార్యకర్త భావించాడు. ఇదే ప్రస్తుతం పరిస్థితికి కారణంగా తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఎన్నికలు ఠాక్రేకి డూ ఆర్ డై పరిస్థితి లాంటివి. అలాంటిది ఈ ఎన్నికల్లో ఎంవీఏతో పొత్తులో 95 సీట్లకు పోటీ చేస్తే 20 సీట్లు గెలుపొందాడు. బీజేపీ కలిసి ఉన్నప్పుడు ఠాక్రే ఎలా ఉండేవారు..? కాంగ్రెస్ తో చేరి ఎలా అయ్యారు..? అనే దాన్ని ప్రజలు పోల్చి చూసుకున్నారు.

3 పార్టీలను ముంచాడు..

సంజయ్ రౌత్ వల్ల ఒక్క ఉద్ధవ్ సేన మాత్రమే కాదు. అటు కాంగ్రెస్ ఇటు ఎన్సీపీలు కూడా నాశనమయ్యాయి. బీజేపీని పదేపదే కెలిగి దాని ఈగోని హర్ట్ చేశాడు. చివరకు పార్టీ లేదు, సీఎం పదవి లేకుండా బీజేపీ రాజకీయ చదరంగంలో ఇరుక్కుపోయారు. శివసేనతో పాటు అటు ఎన్సీపీ కూడా రెండుగా చీలిపోయింది. ఇప్పుడు నిజమైన శివసేన, ఎన్సీపీలు ఎన్డీయే కూటమిలో భాగంగా ఉన్నాయి. భావజాల విరుద్ధంగా ఉన్న పార్టీలు అధికారం కోసం ఏకమయ్యారనే సంకేతాలను బీజేపీ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది. బాల్ ఠాక్రే సమయంలో కాంగ్రెస్ గురించి చేసిన వ్యాఖ్యల్ని పదేపదే బీజేపీ గుర్తు చేసింది. ఫలితంగా కాంగ్రెస్, ఎన్సీపీ శరద్ పవార్, ఠాక్రే సేన మూడు ఉనికి లేకుండా పోయాయి.

5 ఏళ్లలో పార్టీలు ఉంటాయా..?

మరోవైపు శివసేన షిండే 57 సీట్లు, ఎన్సీపీ అజిత్ పవార్ 41 సీట్లు గెలుచుకుని నిజమైన పార్టీలు తామవే అని చెప్పకనే చెప్పారు. మరోవైపు ఎంవీఏ పేలవ ప్రదర్శన రానున్న 5 ఏళ్లలో ఠాక్రే, శరద్ పవార్ తమ ఎమ్మెల్యేలు, ఎంపీలను గీత దాటకుండా చేయడం కత్తిమీద సాములాంటిది. వచ్చే కొద్ది కాలంలోనే మహారాష్ట్ర రాజకీయాలు వేగంగా మారే అవకాశం కనిపిస్తోంది. అజిత్ పవార్, షిండే అసలైన పార్టీల్లోకి ఎమ్మెల్యేలు గోడదూకే అవకాశమే ఎక్కువ. ఇక ఎంపీల కూడా బీజేపీ నుంచి రక్షించుకోవడం కష్టమే.

సోషల్ మీడియాలో విమర్శలు..

శివసేనను సంజయ్ రౌత్ తన సలహాలతో శివసేని ధ్వంసం చేశాడని సోషల్ మీడియాలో చాలా మంది పోస్టులు పెడుతున్నారు. వ్యాపారవేత్త, సామాజిక కార్యకర్త హృతేష్ సింగ్ ఒక అడుగు ముందుకేసి సంజయ్ రౌత్‌పై విమర్శలు గుప్పించాడు. సంజయ్ రౌత్ ఠాక్రే రాజకీయ జీవితాన్ని, శివసేన వారసత్వాన్ని ఒక్క చేతితో నాశనం చేశాడని విమర్శించాడు. “అతను 2.5 సంవత్సరాల అధికారం కోసం తన పేరు, అతని పార్టీ, అతని సిద్ధాంతం మరియు అతని వారసత్వాన్ని మార్చుకున్నాడు. అది విలువైనదేనా?” అంటూ ప్రశ్నించాడు.