Sand mafia: మహారాష్ట్రలో ఇసుక మాఫియా బరితెగించింది. ఏకంగా జిల్లా కలెక్టర్ ను హతమర్చే యత్నం చేసింది. ఇసుకతో వెళ్తున్న లారీని ఆపేందుకు యత్నించిన కలెక్టర్ కారును ఢీకొట్టే ప్రయత్నం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. అక్రమంగా ఇసుకను తవ్వి రవాణా చేస్తున్న లారీ డ్రైవర్ ను బీడ్ జిల్లా కలెక్టర్ నిలువరించే ప్రయత్నంలో ఈ ఘటన జరిగింది. మహిళ కలెక్టర్ దీపా ముధోల్ ముండే తన కారులో ఔరంగాబాద్ నుంచి బీడ్ వెళ్తున్న సమయంలో గురువారం తెల్లవారుజామున 3.15 గంటలకు ధూలే-షోలాపూర్ హైవేలోని గెవ్రాయ్‌లోని మడల్‌మోహి గ్రామ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఇసుక లారీని గుర్తించిన కలెక్టర్ దాన్ని ఆపాల్సిందిగా కారు డ్రైవర్ ని కోరింది. అయితే లారీ డ్రైవర్ ఆపకపోవడంతో కలెక్టర్ కారును అడ్డుపెట్టి లారీని ఆపాల్సిందిగా డ్రైవర్ ని కోరింది. దీంతో లారీ ముందుకు కారును పోనిచ్చి లారీని ఆపే ప్రయత్నం చేశారు. అయితే ఈ సమయంలో లారీ డ్రైవర్ మరింత వేగాన్ని పెంచి కారును ఢీకొట్టే ప్రయత్నం చేశారు. అయితే ప్రమాదాన్ని గమనించిన కలెక్టర్ కారు డ్రైవర్, కారును వేగంగా ముందుకు పోనివ్వడంతో ప్రమాదం తప్పింది.
Read Also: Chicken : భార్యను చికెన్ వండమంటే వండలేదని అలిగి భర్త ఆత్మహత్య
ఇసుకతో వెళ్తున్న లారీని వెంబడించాలని కలెక్టర్ కార్ డ్రైవర్ ని కోరారు. సుమారు ఒక కిలోమీటర్ వెళ్లిన తర్వాత లారీ డ్రైవర్ రోడ్డుపైనే ఇసుకను డంప్ చేశారు. ఈ ఇసుకలో కలెక్టర్ కారు కూరుకుపోయింది. ఆ తరువాత కలెక్టర్ బాడీగార్డ్ అంబాదాస్ పావ్నే లారీ ఎక్కాడు. ఆ సమయంలో లారీ డ్రైవర్, సదరు బాడీగార్డును కూడా బెదిరించాడు. లారీ ఆపకువెళ్లాడు. మూడు కిలోమీటర్ల తరువాత లారీని వదిలి డ్రైవర్ పారిపోయాడు. ఈ ఘటనపై కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
లారీ డ్రైవర్ ప్రకాష్ కోక్రేను పోలీసులు పట్టుకున్నారు. అతడి వాహానాన్ని స్వాధీనం చేసుకున్నారు. సెక్షన్లు 307 (హత్య ప్రయత్నం) మరియు 353 (పబ్లిక్ సర్వెంట్‌ను విధి నిర్వహణ నుండి నిరోధించడానికి క్రిమినల్ బలవంతంగా దాడి చేయడం లేదా ఉపయోగించడం) కింద కేసు నమోదు చేశారు. విచారణ జరుగుతోందని పోలీసులు తెలిపారు.