BJP: ‘‘ఓట్ చోరీ జరిగితే మేం ఎలా ఓడిపోయాం’’.. కాంగ్రెస్‌కు బీజేపీ కౌంటర్..

  • SIRపై విపక్షాల “ఓట్ చోరీ” ఆరోపణలకు సంబిత్ పాత్రా కౌంటర్..
  • బెంగాల్‌లో అత్యధిక ఓట్ల తొలగించిన స్థానాల్లో బీజేపీ ఓడిపోయిందని కామెంట్స్..
  • కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు గెలవలేకే ఇలాంటి ఆరోపణలు..
Bjp

Bjp

BJP: కేంద్రం ఎన్నికల సంఘంపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో బీజేపీ ప్రతిపక్షాలపై ప్రతిదాడికి దిగింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)పై ఎన్నికల కమిషనర్లలో విభేదాలు ఏర్పడినట్లు వచ్చిన నివేదికపై ప్రతిపక్షాలు ఎన్నికల సంఘం, బీజేపీని టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు గుప్పించాయి. ఈ నేపథ్యంలో బీజేపీ అధికా ప్రతినిధి సంబిత్ పాత్ర మాట్లాడుతూ.. 2014లో ప్రధాని నరేంద్రమోడీ మోడీ అధికారంలోకి వచ్చిప్పటి నుంచి దేశ ప్రజలు ప్రతిపక్షాలను నిరంతరం తిరస్కరిస్తూనే వస్తున్నారని సంబిత్ పాత్ర అన్నారు. కాంగ్రెస్, దాని మిత్ర పక్షాలు ప్రజల మద్దతు పొందడంలో విఫలమవుతూ ఉన్నాయని అన్నారు. దీంతోనే దేశ రాజ్యాంగ సంస్థలపై వ్యవస్థీకృత దాడులకు పాల్పడుతున్నాయని ఆరోపించారు.

‘‘ఓట్ చోరీ’’ అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్, ప్రతిపక్షాల తీరుపై ఆరోపించారు. ఓట్ల తొలగింపుతో బెంగాల్‌లో బీజేపీ లాభపడిందనే ప్రతిపక్షాల వాదనల్ని సంబిత్ పాత్ర తిరస్కరించారు. అత్యధిక ఓటర్ల పేర్లు తొలగించిన 20 అసెంబ్లీ స్థానాల్లో సగానికి పైగా బీజేపీ గెలవలేదనే విషయాన్ని గుర్తుచేశారు. అత్యధిక పేర్లు తొలగించబడిన 20 నియోజకవర్గాల్లో 13 స్థానాల్లో టీఎంసీ గెలిచిందని, 6 స్థానాల్లో బీజేపీ, ఒక స్థానంలో కాంగ్రెస్ గెలిచిందని అన్నారు. ఓట్ చోరీ నిజంగా జరిగితే బీజేపీ సగం స్థానాల్లో ఎందుకు ఓడిపోయిందని ప్రశ్నించారు.

ఎన్నికల సంఘంలో కమిషనర్ల మధ్య విభేదాలు వచ్చాయనే రిపోర్టుపై సంబిత్ పాత్ర స్పందిస్తూ.. కమిషనర్ల మధ్య అధికారిక చర్చలు, అభిప్రాయ బేధాలు ఉండటం ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగమని అన్నారు. దీనికి ముందు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదికలో.. ఎస్ఐఆర్ ప్రక్రియపై ఇద్దరు కమిషనర్లు పలు అభ్యంతరాలు వ్యక్తం చేశారని పేర్కొంది. దీంతో వివాదం మొదలైంది. అయితే, ఈ రిపోర్టుపై ఈసీ స్పందిస్తూ.. తుది నిర్ణయాలు అన్నీ ముగ్గురు కమిషనర్లు ఏకగ్రీవ ఆమోదంతోనే తీసుకున్నామని తెలిపింది.