Sambhal violence: సంభాల్ హింసకు సంబంధించిన సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఓ ఆడియో క్లిప్‌లో ఈ కుట్రకు సంబంధించిన కీలక విషయాలు ఉన్నాయి. ఇటీవల ఉత్తర్ ప్రదేశ్ సంభాల్‌లోని జామా మసీదు సర్వేకి వెళ్లిన అధికారులు, పోలీసులుపై వేల సంఖ్యలో గుంపు రాళ్లదాడికి పాల్పడింది. ఈ హింసాత్మక ఘర్షణలో ఐదుగురు వ్యక్తులు మరణించగా, 20 మంది వరకు పోలీసులు గాయపడ్డారు. ఆందోళనకారులు పలు ఇళ్లు ధ్వంసం చేశారు, వాహనాలకు నిప్పుపెట్టారు.
అయితే, ఈ ఘటనలో ఎక్కువ మంది మసీదు ఉన్న ప్రాంతానికి వచ్చారు..? ఎలా ఆయుధాలను సమీకరించారనే వివరాలతో కూడి ఓ ఆడియో క్లిప్ వెలుగులోకి వచ్చింది. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్ల నుంచి ఆడియో క్లిప్‌ని దర్యాప్తు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గుర్తుతెలియని వ్యక్తి మొఘల్ కాలం నాటి షాహీ జామా మసీదు దగ్గరకు ఎక్కువమందిని తీసుకురావాలని పిలుపునిచ్చాడు. ‘‘సామన్ లేకర్ ఆ మస్జద్ కే పాస్. మేరే భాయ్ కా ఘర్ హై(ఆయుధాలు తీసుకుని మసీదు దగ్గరికి రండి, నా సోదరుడి ఇల్లు సమీపంలో ఉంది)’’అని ఆడియోలో చెప్పబడింది.
Read Also: OTT : ఓటీటీలో రిలీజ్ అయిన ప్రియదర్శి, టోవినో థామస్ సినిమాలు
ఈ కేసులో ఇప్పటి వరకు 25 మందిని పోలీసులు అరెస్ట్ చేసి, 7 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు. సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జియా ఉర్ రెహ్మాన్ బార్క్, స్థానిక ఎమ్మెల్యే ఇక్బాల్ మొహమూద్ కుమారుడు సోహైల్ ఇక్బాల్‌ల పేర్లను ఎఫ్ఐఆర్‌లో చేరార్కారు. హింసకు రెండు రోజుల ముందు బార్క్ షాహీ జామా మసీదు ప్రార్థనలకు వచ్చి, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు.
షాహీ జామా మసీదు ఉన్న స్థలంలో పురాతన హరిహర్ దేవాలయం ఉందని దీనిపై కోర్టులో పిటిషన్ దాఖలైంది. దీంతో మసీదు సర్వేకు కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఆదివారం మసీదు సమీపంలో ఆందోళనకారులు, సర్వే బృందంపై దాడికి దిగారు. మొఘల్ రాజు బాబర్ కాలంలో ఆలయాన్ని కూల్చేసి మసీదు నిర్మించారని హిందూ పక్షం పిటిషన్ దాఖలు చేసింది. దీనికి చారిత్రక మొఘల్ గ్రంథాలు ‘‘బాబార్ నామా’’, ఐన్ ఏ అక్బరీలో ఉన్న వివరాలను హిందూ పక్షం కోర్టు ముందుంచింది. మరోవైపు ముస్లిం పక్షం 1991 ప్రార్థనా స్థలాల చట్టాన్ని కోర్టు ఉత్తర్వులు దెబ్బతీస్తున్నాయని ఆరోపించింది. 1947 ఆగస్టు 15 తర్వాత ప్రార్థనా స్థలాలు ఎలా ఉన్నాయో వాటి స్థితిని మార్చొద్దని ప్రార్థనా స్థలాల చట్టం సూచిస్తుంది.