ఇటీవల బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్‌కు బెదిరింపుల లేఖ వచ్చిన విషయం తెలిసిందే! పంజాబ్ సింగర్ సిద్ధూ మూసేవాలాని ఎలా కాల్చి చంపామో.. అలాగే నిన్ను, నీ తండ్రి సలీమ్ ఖాన్‌ను చంపేస్తామంటూ అతనికి లేఖ వచ్చింది. ఈ లేఖ అందుకున్న వెంటనే సల్మాన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, అతనికి భద్రత పెంచడంతో పాటు దర్యాప్తును వేగవంతం చేశారు. ఇన్నిరోజులు ఈ లేఖపై స్పందించని సల్మాన్.. తాజాగా ఓపెన్ అయ్యాడు. ఈ వ్యవహారంలో తనకు ఎవరిపైనా అనుమానాలు లేవని తెలిపాడు. అంతేకాదు.. తనకు గోల్డీ బ్రార్ ఎవరో కూడా తెలియదని పేర్కొన్నాడు.
‘‘నాకు ఎవరితోనూ శతృత్వం లేదు. సిద్ధూను తాను చంపానని చెప్పుకుంటోన్న గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ ఎవరో నాకు తెలీదు. నా తండ్రి మార్నింగ్ వాక్ చేస్తున్న సమయంలో ఈ బెదిరింపుల లేఖ వచ్చింది’’ అని సల్మాన్ చెప్పుకొచ్చాడు. అయితే.. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గురించి మాత్రం తనకు తెలుసన్నాడు. కృష్ణజింకను వేటాడిన కేసులో అతని నుంచి తనకు 2018లో చంపేస్తానన్న బెదిరింపులు వచ్చాయని అన్నాడు. ఆ లేఖ ఎవరి నుంచి వచ్చిందో తనకు తెలియదని, ఈ విషయంపై పోలీసులు విచారణ చేస్తున్నాడని సల్మాన్ వెల్లడించాడు. సిద్ధూని కాల్చిన చంపిన కొన్ని రోజుల్లోనే సల్మాన్‌కి ఈ లేఖ రావడంతో.. పోలీసులు ఈ కేసుని చాలా సీరియస్‌గా తీసుకున్నారు. లేఖ ఎవరి నుంచి వచ్చిందన్న విషయంపై దర్యాప్తును వేగవంతం చేశారు. కచ్ఛితంగా ఈ లేఖతో గ్యాంగ్‌స్టర్ బిష్ణోయ్ వర్గానికి చెందిన వాళ్లతో లింక్ కలిగి ఉంటుందని అనుమానిస్తున్నారు.
కాగా.. ‘హమ్ సాథ్ సాథ్ హై’ సినిమా షూటింగ్ సమయంలో సల్మాన్ ఖాన్ తన తోటి నటీనటులతో కలిసి కృష్ణజింకల్ని వేటాడినట్టు ఆరోపణలు వచ్చాయి. బిష్ణోయ్ వర్గాలు కృష్ణజింకల్ని ఎంతో ఆదరిస్తారు. సల్మాన్‌పై ఆ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో.. ఆ వర్గానికి చెందిన వారే సల్మాన్‌పై కోర్టు మెట్లెక్కారు. అప్పట్నుంచీ ఈ కేసు విచారణ కొనసాగుతూ వస్తోంది. ఈ క్రమంలోనే సల్మాన్‌ని చంపుతానంటూ బిష్ణోయ్ బెదిరించాడు. ఇప్పుడు సిద్ధూని హత్యకు గురైన కొన్ని రోజులకే సల్మాన్‌కి బెదిరింపుల లేఖ వచ్చిన క్రమంలో.. ఆ గ్యాంగ్‌తో లింక్ ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. అయితే, ఆ లేఖతో తనకెలాంటి సంబంధం లేదని బిష్ణోయ్ తోసిపుచ్చుతున్నాడు.