Wrestlers Protest: భారత రెజ్లర్ సమాఖ్య( డబ్ల్యూఎఫ్)చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషన్ శరణ్ సింగ్ ను అరెస్ట్ చేయాలంటూ గత కొన్ని రోజులుగా రెజ్లర్లు ఆందోళన చేస్తున్నారు. మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు బ్రిజ్ భూషన్ పై ఆరోపణలు చేస్తున్నారు రెజర్లు. ఇదిలా ఉంటే శనివారం బ్రిజ్ భూషన్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ.. రెజ్లర్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం కీలక పరిణామాలు సంభవించాయి. రెజ్లర్ల ఆందోళనల్లో కీలకంగా వ్యవహరిస్తున్న సాక్షి మాలిక్ ఆందోళన నుంచి విరమించుకున్నట్లు తెలిసింది. తిరిగి ఆమె ఉత్తర రైల్వేలో తన పదవిలో చేరింది.
ఇదిలా ఉంటే సాక్షి మాలిక్ భర్త సత్యవ్రత్ కడియన్ మాత్రం అమిత్ షాతో జరిగిన రెజ్లర్ల సమావేశం అసంపూర్తిగా ఉందని, హోం మంత్రి నుంచి కోరుకున్న స్పందన రాలేదని అన్నారు. శనివారం అర్థరాత్రి అమిత్ షా నివాసంలో సాక్షి మాలిక్, సంగీతా ఫోగట్, సత్యవర్త్ కడియన్, భజరంగ్ పునియా సమావేశం అయ్యారు. ఇదిలా ఉంటే ఇటీవల హరిద్వార్ లో గంగానదిలో తమ పతకాలను పారేస్తామని రెజ్లర్లు అక్కడికి చేరుకోగా.. రైతు నాయకుడు నరేష్ టికాయత్ కలుగచేసుకోవడంతో ఈ చర్యను విరమించారు. జూన్ 9 లోపు బిజెపి ఎంపి బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ రైతు నాయకులు ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చాయి. ఈ నేపథ్యంలో సాక్షి మాలిక్ ఆందోళన నుంచి తప్పుకోవడం చర్చనీయాంశంగా మారింది. బ్రిజ్ భూషన్ పై రెండు ఎఫ్ఐఆర్లు నమోదు అయ్యాయి. ఇందులో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.