S-400 sudarshan chakra: పాకిస్తాన్ ప్రయోగిస్తున్న డ్రోన్లు, క్షిపణుల నుంచి భారత్‌ని ‘‘S-400 సుదర్శన చక్ర’’ క్షిపణి రక్షణ వ్యవస్థ కాపాడుతోంది. ప్రపంచంలోనే అత్యుత్తమమైన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలో ఇది ఒకటి. అత్యంత ఖచ్చితత్వంతో శత్రువుల నుంచి వస్తున్న వైమానిక దాడులను తిప్పికొడుతుంది. గురువారం రాత్రి సమయంలో పాకిస్తాన్ దాడిని కూడా ఈ వ్యవస్థ సమర్థంగా అడ్డుకుంది.
రష్యా నుంచి కొనుగోలు చేసిన S-400 మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్ పనితీరుపై ఇప్పుడు అందరు ప్రశంసలు కురిపిస్తాను. కానీ, ఈ వ్యవస్థ కొనుగోలు కోసం భారత్ చాలా ఇబ్బందులు, హెచ్చరికలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ముఖ్యంగా, S-400 కొనుగోలు చేయవద్దని అమెరికా, భారత్‌పై ఎంతో ఒత్తిడి తీసుకువచ్చింది. మనదేశంలోని కొందరు నేతలు కూడా ఇంత ఖర్చుతో ఈ వ్యవస్థని ఎందుకు కొనుగోలు చేస్తున్నారంటూ ప్రశ్నించారు.
అయితే, ఈ డీల్ వెనక దివంగత రక్షణ మంత్రి మనోహర్ పారికర్ తెగువ కనిపిస్తుంది. రష్యాతో ఈ ఒప్పందం కుదుర్చుకోవడంలో 2016లో అప్పటి ఢిఫెన్స్ మినిస్టర్ పారికర్ కీలకంగా వ్యవహరించారు. ఎన్నో ఒత్తిళ్లు వచ్చినప్పటికీ, భారత్‌కి చైనా, పాకిస్తాన్ నుంచి పొంచి ఉన్న ముప్పు కారణంగా వీటిని రష్యా నుంచి కొనుగోలు చేశారు. ఇప్పుడు, దీని ప్రభావం స్పష్టంగా ప్రజలకు తెలుస్తోంది.
S-400 క్రూయిజ్ క్షిపణులు, విమానాలు, ఇంటర్మీడియట్-రేంజ్ బాలిస్టిక్ క్షిపణులను కూడా సులభంగా ఢీకొట్టగలదు. ముఖ్యంగా అమెరికా, దాని మిత్ర దేశాలు, నాటో కూటమిలో కూడా దీనికి సరితూగే క్షిపణి రక్షణ వ్యవస్థ లేదు. 2018లో రష్యాతో ఐదు S-400 యూనిట్లను కొనుగోలు చేయడానికి $5 బిలియన్ల ఒప్పందంపై భారత్ సంతకం చేసింది. ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే ఈ క్షిపణి వ్యవస్థ 600 కి.మీ దూరంలో ఉన్న శత్రు దేశాల లక్ష్యాలను టార్గెట్ చేయగలదు.