NTV Telugu Site icon

RSS: మహారాష్ట్రలో బీజేపీ ఫలితాలకు అజిత్ పవార్ ఎన్సీపీనే కారణం.. ఆర్ఎస్ఎస్ విమర్శలు..

Maharashtra

Maharashtra

RSS: మహారాష్ట్రలో లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఎన్డీయే కూటమికి భారీ ఎదురుదెబ్బగా చెప్పవచ్చు. ముఖ్యంగా బీజేపీకి సొంతగా మెజారిటీ రాకపోవడానికి పెద్ద రాష్ట్రాలైన ఉత్తర్ ప్రదేశ్, మహారాష్ట్ర కారణమయ్యాయి. ఈ నేపథ్యంలో బీజేపీ ఘోరమైన ప్రదర్శనకు అజిత్ పవార్ ఎన్సీపీనే కారణమని ఆర్ఎస్ఎస్ విమర్శించింది. ఆర్ఎస్ఎస్ అనుబంధ మరాఠీ వారపత్రికలో ‘కార్యకర్త ఖచ్లేలనాహి, తార్ సంభ్రమత్’ (కార్యకర్త నిరుత్సాహపడడు, కానీ గందరగోళానికి గురవుతాడు) హెడ్‌లైన్‌లో ‘వివేక్’ పత్రికలో కథనం వచ్చింది. బీజేపీకి, పార్టీ కార్యకర్తలకు మధ్య కమ్యూనికేషన్ లేకపోవడంతోనే కాషాయ పార్టీ పేలవమైన ఎన్నికల ప్రదర్శనను చేసినట్లు పత్రికలో ఆరోపించింది. అంతకుముందు ఆర్ఎస్ఎస్‌కి చెందిన మ్యాగజైన్ ‘ ఆర్గనైజన్ ’ లో లోక్‌సభ ఎన్నికల్లో అతివిశ్వాసం బీజేపీ దెబ్బతీసిందని, బీజేపీ నాయకులు-కార్యకర్తలు రియాలిటీ చెక్ చేసుకోవాలని సూచించింది.

ప్రస్తుతం వివేక్ కథనంలో.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేకి చెందిన శివసేనతో బీజేపీ పొత్తు సహజమైనదిగా రాష్ట్రప్రజలు అంగీకరించారని, అయితే అజిత్ పవార్ ఎన్సీపీతో జట్టుకట్టడం వ్యతిరేకమైందని చెప్పింది. దాదాపు ప్రతీ కార్యకర్త లోక్‌సభ ఎన్నికల వైఫల్యం వెనక కారణాలను గురించి మాట్లాడుతూ, తమ అసంతృప్తిని వివరించారని, ఇందుకు ఎన్సీపీతో పొత్తు కారణమని చెప్పారని, బీజేపీ కార్యకర్తలు ఎన్సీపీతో కలిసి పనిచేయడానికి ఇష్టపడలేదనే విషయం స్పష్టంగా తెలుస్తోందని చెప్పింది.

Read Also: Venkaiah Naidu: రేవంత్ రెడ్డిని మెచ్చుకున్న మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు..ఎందుకంటే..

మొత్తం 48 ఎంపీ సీట్లు ఉన్న మహారాష్ట్రలో ‘మహాయుతి’ కూటమి కింద బీజేపీ, ఏక్ నాథ్ షిండే శివసేన, అజిత్ పవార్ ఎన్సీపీ కలిసి పోటీ చేశాయి. మహాయుతి కేవలం 17 స్థానాల్లో మాత్రమే గెలిచింది. ఇందులో బీజేపీ 28 సీట్లలో పోటీ చేస్తే కేవలం 09 స్థానాల్లో మాత్రమే గెలిచింది. ఎన్సీపీ ఒకటి, శివసేన(షిండే) 07 స్థానాల్లో విజయం సాధించింది. 2019లో బీజేపీ సొంతగా 23 ఎంపీలను గెలిచింది. మరోవైపు కాంగ్రెస్-శివసేన(ఉద్ధవ్)- ఎన్సీపీ(శరద్ పవార్)ల కూటమి ‘‘ మహా వికాస్ అఘాడీ’’ ఏకంగా 30 స్థానాలను కైవసం చేసుకుంది. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పోటీ చేసిన 17 స్థానాల్లో 13 స్థానాలను గెలుచుకుంది.

షిండే శివసేనతో బీజేపీ పొత్తు సహజమైనదని పేర్కొంటూనే, ఎన్సీపీ అజిత్ పవార్‌తో జత కట్టడాన్ని తప్పుపట్టింది. కార్యకర్తల నుంచి నాయకులను తయారుచేసే పార్టీ బీజేపీ అని, ఇప్పుడు అది తారుమారైందని కార్యకర్తలు భావిస్తున్నారని ఆర్ఎస్ఎస్ పత్రిక కథనం పేర్కొంది. బీజేపీని విమర్శిస్తూ ప్రతిపక్షాలు చేసిన ‘‘వాషింగ్ మెషిన్’’ నిందల్ని ప్రస్తావిస్తూ, హిందుత్వ వాదులు సోషల్ మీడియాలో తమ అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు చెప్పింది. ఆర్ఎస్ఎస్, బీజేపీ ఒంటెద్దు పోకడల్ని విమర్శిస్తోంది. ఆర్ఎస్ఎస్ నాయకుడు ఇంద్రేష్ కుమార్ బీజేపీ పనితీరుకు ‘‘అహంకారం’’ కారణమని, అదే కారణంగా రాముడు 241 సీట్ల వద్దే ఆగిపోయేలా చేశాడని అన్నారు.