‘‘రైలుబండి నడిపేది పచ్చజెండాలే బ్రతుకుబండిని నడిపేది పచ్చనోటులే’’ అని ఓ సినీ కవి పాట రూపంలో తెలియజేశారు. ఇది ముమ్మాటికీ అక్షర సత్యం. ఆ నోటు కోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండలో మాడుతూ పని చేస్తే పేదోడికి బువ్వ దొరుకుతుంది. లేదంటే ఆకలితో పస్తుండాలి. ఆ కరెన్సీ విలువ పేదోళ్లకు బాగా తెలుసు. కానీ పంజాబ్‌లో ఓ పెళ్లి వేడుకలో కోట్లాది రూపాయల నోట్లను చెత్త కాగితాల్లో ఎగరేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తున్నాయి.
ఫిబ్రవరి 14న తర్న్ తరుణ్‌లో వివాహం జరిగింది. డీజేలతో సందడి.. సందడిగా నృత్యాలతో సాగుతోంది. ఈ సందర్భంగా మండపంలో వధువు నిలబడి ఉండగా ఆమెపై అతిథులు రూ.8.5 కోట్ల కరెన్సీ నోట్లు కురిపించారు. వరుడి కుటుంబమే వధువుకు రూ.8.5 కోట్ల నగదు ఇచ్చారనే వాదనలను వినిపిస్తున్నాయి.
ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో సోషల్ మీడియాలో ఆరోపణలు వస్తున్నాయి. కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేస్తారని మండిపడుతుననారు. ఈ కార్యక్రమాన్ని చాలామంది ‘గ్రాండ్ క్యాష్ పార్టీ’గా అభివర్ణించారు. అయితే నగదు వర్షంపై వరుడి సోదరుడు సికందర్ సింగ్ స్పందించాడు. ఒరిజనల్ డబ్బులే అయినప్పటికీ కోట్లు కాదని.. లక్షల్లోనే విసిరినట్లుగా చెప్పాడు.
