Delhi liquor scam: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కుమారుడు రాఘవరెడ్డిని ప్రశ్నించారు ఈడీ అధికారులు. ఈ కేసుతో సంబంధం ఉన్న మరికొందరిని కూడా పిలిచి విచారణ జరిపారు. రాఘవరెడ్డికి ఎదురుగా అరుణ్ రామచంద్రపిళ్లైని కూర్చోబెట్టి ఇద్దరిని ప్రశ్నించారు. మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఐదుగురు నిందితులకు బెయిల్ నిరాకరించింది… ఢిల్లీలోని రౌస్ అవెన్యూ స్పెషల్ కోర్టు. బెయిల్ పిటిషన్లను తిరస్కరించింది. లిక్కర్ స్కామ్ కేసులో అభిషేక్ బోయిన్ పల్లి, శరత్ చంద్రారెడ్డితో పాటు విజయ్‌నాయర్, బినయ్ బాబు, సమీర్ మహేంద్రులది కీలక పాత్ర అని ఈడీ వాదించింది. వీరిపై ఆరోపణలు చాలా తీవ్రమైనవని, మనీలాండరింగ్ చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని అధికారులు కోర్టులో వాదించారు. ఈడీ వాదనలతో ఏకీభవించిన కోర్టు… ఐదుగురి బెయిల్ పిటిషన్లను తిరస్కరిస్తూ… 123 పేజీల తీర్పు వెలువరించింది. మొత్తానికి ఢిల్లీ లిక్కర్ పాలసీలో కేసులో ఈడీ అధికారులు దర్యాప్తును మరింత ముమ్మరం చేశారు.