ఉత్తర్ ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అయోధ్యకు వెళ్తున్న క్రమంలో బస్సును ట్రక్కు ఢీకొట్టింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న 7 మంది మృతి చెందారు. ఈ ప్రమాదం మోతీపూర్ ప్రాంతంలో జరిగింది. కర్ణాటకకు చెందిన 16 మంది టూరిస్టులు అయోధ్యను వెళ్తుండగా ఎదురగా వస్తున్న ట్రక్కు, బస్సును ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. 16 మందిలో ఏడుగురు చనిపోతే అందులో ముగ్గరు మహిళలు ఉన్నారు. తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో కూడా కొంతమంది పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.
బహ్రైచ్-లఖీంపూర్ హైవే పై కర్ణాటక నుంచి 16 మందితో వెళ్తున్న బస్సును మోతీపూర్ ప్రాంతంలోని నానిహా మార్కెట్లో ప్రమాదం జరిగినట్లు అడిషనల్ సూపరింటెండెంట్ అశోక్ కుమార్ వెల్లడించారు. బస్సు డ్రైవర్ తో పాటు ఐదుగురు అక్కడిక్కడే మరణించారు. మరో ఇద్దరిని ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలో మరణించారని.. మొత్తం 9 మంది గాయాలపాలయ్యారని పోలీసులు తెలిపారు. ఘటన అనంతరం ట్రక్కు డ్రైవర్ పరారయ్యాడు. మృతులకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంతాపం తెలిపారు మరియు క్షతగాత్రులకు మంచి వైద్యం అందేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.