NDA: ఆదివారం ఢిల్లీలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎంల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సాయుధ దళాల పరాక్రమాన్ని, ప్రధాని నరేంద్రమోడీ ధైర్యమైన నాయకత్వాన్ని ప్రశంసిస్తూ తీర్మానాన్ని ఆమోదించింది. శివసేన చీఫ్, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే ప్రవేశపెట్టిన తీర్మానం, ఆపరేషన్ సిందూర్ భారతీయుల ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని పేర్కొంది. ప్రధాని మోదీ నాయకత్వాన్ని ప్రశంసిస్తూ, ఆయన ఎల్లప్పుడూ సాయుధ దళాలకు మద్దతు ఇస్తున్నారని, ఆపరేషన్ సిందూర్ ఉగ్రవాదులకు, వారి స్పాన్సర్లకు తగిన సమాధానం ఇచ్చిందని కొనియాడారు.
Read Also: PakIstan: భారత్ టార్గెట్‌గా అణ్వాయుధాలను ఆధునీకరిస్తున్న పాకిస్తాన్.. యూఎస్ రిపోర్ట్..
ఈ సమావేశానికి దాదాపుగా 19 మంది ముఖ్యమంత్రులు, అంతే స్థాయిలో డిప్యూటీ సీఎంలు హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్రధాని మోడీ, కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ చీఫ్ జేపీనడ్డా పాల్గొన్నారు. కుల గణన, మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా జరుపుకునే వేడుకలు, పరిపాలన అంశాలు ఈ సమావేశంలో ఎజెండాగా ఉన్నాయి. ఈ సమావేశంలో, పలువురు ఎన్డీయే రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ రాష్ట్రాల్లోని ప్రముఖమైన పథకాలపై ప్రజెంటేషన్లు ఇచ్చారు. ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడిలో మరణించిన వారికి సమావేశంలో నివాళులు అర్పించారు.