Bangladesh: బంగ్లాదేశ్‌లోని మహ్మద్ యూనస్ సర్కార్ నెమ్మదిగా ఆ దేశ చరిత్రను కాలగర్భంలో కలిపేందుకు ప్రయత్నిస్తోంది. బంగ్లాదేశ్ ఏర్పాటుకు కారణమైన, ఆ దేశ జాతిపితగా కీర్తించబడే షేక్ ముజిబుర్ రెహ్మన్‌కి సంబంధించిన చరిత్రను పాఠశాల పుస్తకాల నుంచి తొలగించేందుకు సిద్ధమైంది. మాజీ ప్రధాని షేక్ హసీనా తండ్రి అయిన ముజిబుర్ రెహ్మాన్ పాత్రను స్వాతంత్య్ర పోరాటం నుంచి తగ్గిస్తోంది. దీనికి తోడు 1971లో బంగ్లాదేశ్ విముక్తి యుద్ధానికి కారణమైన, బంగ్లాదేశ్ ఏర్పాటుకు సహకరించిన భారత్ సహకారాన్ని కూడా తొలగిస్తోంది. బంగ్లాదేశ్‌లోని జాతీయ పాఠ్య ప్రణాళిక మరియు పాఠ్యపుస్తక బోర్డు (NCTB) ప్రాథమిక, మాధ్యమిక మరియు ఉన్నత మాధ్యమిక విద్యార్థులు ఉపయోగించే 441 పాఠ్యపుస్తకాలకు సవరణలు చేసింది.
ఆగస్టు 05, 2024లో పదవీచ్యుతరాలైన అవామీ లీగ్ నాయకురాలు షేక్ హసీనా తర్వాత పదవీ బాధ్యలు చేపట్టిన తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్ అనేక సంస్కరణలకు పిలుపునిచ్చాడు. నిజానికి షేక్ ముజిబుర్ రెహ్మన్ బంగ్లాదేశ్ విముక్తి పోరాటానికి నాయకత్వం వహించారు. అయితే, విముక్తి యుద్ధంలో పాల్గొన్న, అవామీలీగ్‌ని విమర్శించే నాయకులను పాఠ్యపుస్తకాల్లో చేర్చుతున్నారు. కొత్త పాఠ్యపుస్తకాల్లో ‘‘ మార్చి 26, 1971న జియావుర్ రెహమాన్ బంగ్లాదేశ్‌కి స్వాతంత్ర్యాన్ని ప్రకటించారని, మార్చి 27న బంగబంధు తరపున ఆయన మరో స్వాతంత్య్ర పోరాటం చేశారు’’ అని చేర్చినట్లు జాతీయ పాఠ్యాంశాలు, పాఠ్యపుస్తక బోర్డు చైర్మన్ ప్రొఫెసర్ ఎకేఎం రియాజుల్ హసన్ అన్నారు.
Read Also: DeepSeek: చైనాలో ప్రతీ ఇంట్లోకి దూరిపోతున్న ‘‘డీప్ సీక్’’..
జియావుర్ రెహమాన్, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ) వ్యవస్థాపకుడు. ప్రస్తుతం బీఎన్సీ చీఫ్ ఖలీదా జియా భర్త. బీఎన్సీ, ఖలిదా జియాలు పాకిస్తాన్ అనుకూలురుగా ముద్ర పడింది. అంతకుముందు, షేక్ హసీనా రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత, 2010 నుంచి పాఠ్యపుస్తకాల్లో ముజిబుర్ రెహ్మన్ మార్చి 26, 1971న పాకిస్తాన్ సైన్యం అరెస్ట్ చేయడానికి ముందు వైర్ లెస్ సందేశం ద్వారా స్వాతంత్య్రం ప్రకటించినట్లు పేర్కొన్నాయి.
బంగ్లాదేశ్ స్వాతంత్య్ర ప్రకటన వివాదాస్పదంగా ఉంది. అవామీ లీగ్ మద్దతుదారులు ముజిబుర్ రెహ్మన్ ప్రకటన చేశారని చెబుతుంటే, లిబరేషన్ వార్‌లో ఆర్మీ మేజర్ అండ్ సెక్టార్ కమాండర్ అయిన జియావుర్ రెహమాన్ సూచనలతోనే ముజిబుర్ రెహ్మన్ ప్రకటన చదివారని బీఎన్పీ చెబుతోంది. ప్రస్తుతం, బంగ్లాదేశ్‌లో ముజిబుర్ రెహ్మాన్ చరిత్రను తొలగించే ప్రయత్నం చేస్తోంది. అవామీ లీగ్, షేక్ హసీనా ఉనికి లేకుండా చేయడానికి మహ్మద్ యూనస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
దీనికి తోడుగా, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, ముజిబుర్ రెహ్మన్ కలిసి ఉన్న ఫోటోని 6వ తరగతి ఇంగ్లీష్ పుస్తకం నుంచి తొలగించినట్లు తెలుస్తోంది. 5వ తరగతి పుస్తకం నుంచి పాకిస్తాన్ దళాలు భారత సైన్యం ముందు లొంగిపోతున్న ఫోటోని కూడా తొలగించారు. షేక్ హసీనా పాలన సమయంలో, పాఠ్యపుస్తకాల్లో హిందూత్వాన్ని వ్యాప్తి చేస్తున్నారని, బెంగాల్ ముస్లిం పాలకుల సహకారాన్ని దెబ్బతీస్తున్నారని, డార్విన్ సిద్ధాంతాన్ని బోధించడం ద్వారా ముస్లింల మత విశ్వాసాలను అవమానిస్తున్నారని కొందరు ముస్లిం ఛాందసవాదులు విమర్శలు చేశారు.