మరో బ్యాంకు కుప్పకూలింది. మహారాష్ట్రకు చెందిన ఇండిపెండెన్స్ కోఆపరేటివ్ బ్యాంకు లిమిటెడ్ లైసెన్సును రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) రద్దు చేసింది. బ్యాంకింగ్ కార్యకలాపాలను సీజ్ చేస్తున్నట్టు ఆర్‌బీఐ ప్రకటించింది. నేటి నుంచే అంటే ఫిబ్రవరి 3, 2022 నుంచే ఇది అమల్లోకి వస్తున్నట్టు తెలిపింది. గురువారం దీనిపై ఆర్‌బీఐ ఓ ప్రకటన విడుదల చేసింది. బ్యాంకు ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని, తాము గతేడాదినే కొన్ని ఆంక్షలు విధించినట్టు ఆర్‌బీఐ తెలిపింది. ఈ నిర్ణయంతో ఆరు నెలల వరకు కస్టమర్లు మనీని విత్‌డ్రా చేసుకోవడానికి వీలులేకుండా పోయింది.
ఆంక్షల విధించినా కూడా బ్యాంకు వ్యాపార కార్యకలాపాల పరిస్థితి మెరుగుపరుచుకోలేకపోవడంతో.. లైసెన్స్ రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు ఆర్‌బీఐ తెలిపింది. బ్యాంకు వద్ద సరిపోయే మూలధనం లేదని ఆర్‌బీఐ పేర్కొంది. భవిష్యత్‌లో ఆదాయాలు వచ్చే మార్గం కూడా లేదని చెప్పింది. ఇలాంటి పరిస్థితుల్లో కస్టమర్ల, డిపాజిటర్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ బ్యాంకు లైసెన్స్‌ను రద్దు చేస్తున్నట్టు వెల్లడించింది.