Ratan Tata family tree: భారత పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా 86 ఏళ్ల వయసులో కన్నుమూశారు. గుండు సూది నుంచి ఎయిర్ ప్లేన్స్ వరకు అన్ని రంగాల్లో సత్తా చాటారు. పెద్ద పారిశ్రామికవేత్తగానే కాకుండా.. దాతృత్వం పరంగా ఉన్నత స్థానంలో నిలిచారు. దేశంలో ప్రతీ కుటుంబం కూడా రతన్ టాటా మరణం దిగ్భ్రాంతికి గురించేసింది. రతన్ టాటా టాటా గ్రూప్‌ని ప్రపంచ వ్యాపారశక్తిగా మార్చడంలో కీలక పాత్ర పోషించారు. ప్రపంచవ్యాప్తంగా 100 కంటే ఎక్కువ దేశాల్లో తన సామ్రాజ్యాన్ని విస్తరించారు.
* డిసెంబర్ 28,1937లో జన్మించిన రతన్ టాటా భారతదేశంలో అత్యంత ప్రసిద్ధ వ్యాపార కుటుంబానికి చెందినవారు. టాటా కుటుంబ స్థాపకుడు నుస్సర్వాన్ జీ టాటాతో మొదలవుతుంది.
* నుస్సర్వాన్ జీ టాటా (1822-1886) టాటా వంశానికి మూలపురుషుడిగా చెప్పబడుతున్నారు. ఈయన జీవన్ బాయి కవాస్‌జీ టాటాను వివాహం చేసుకున్నాడు. వీరికి ఐదుగురు పిల్లలు — జమ్‌షెట్ జీ టాటా, రతన్ బాయి టాటా, మానెక్ బాయి టాటా, విర్‌బైజీ టాటా, జెర్‌బాయి టాటా.
* నుస్సర్వాన్ జీ కుమారుడు జమ్‌షెడ్ జీ టాటా(1839-1904), టాటా గ్రూప్‌ని స్థాపించారు. ఆ తర్వాతి కాలంలో టాటా గ్రూప్ అతిపెద్ద వ్యాపార సమ్మేళనంగా మారింది. ‘‘ భారత పరిశ్రమ పితామహుడి’’గా జమ్ షెడ్ జీ టాటాను పేర్కొంటారు. ఈయన 1870లలో సెంట్రల్ ఇండియాలో టెక్స్‌టైల్ మిల్లుతో తన వ్యవస్థాపక ప్రయాణాన్ని ప్రారంభించాడు. భారతదేశం యొక్క ఉక్కు మరియు విద్యుత్ పరిశ్రమలను రూపొందించడంలో, సాంకేతిక విద్యా సంస్థలను స్థాపించడంలో మరియు భారతదేశ పారిశ్రామిక పురోగతిని ముందుకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించారు.
జమ్‌షెడ్ జీ కుటుంబం-వారసులు
* జమ్‌షెడ్ జీ హీరాబాయి దాబూను వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు — సర్ దొరాబ్జీ టాటా, ధున్‌బాయి టాటా, సర్ రతన్ టాటా.
* సర్ దొరాబ్జీ టాటా (1859-1932) జమ్‌షెడ్ జీ పెద్ద కుమారుడు. ఇతను టాటా గ్రూప్ వృద్ధిలో కీలక పాత్ర పోషించారు. దొరాబ్జీకి పిల్లలు లేరు, తన కుటుంబ వ్యాపార విస్తరణకే ఎక్కువ నిమగ్నమయ్యారు.
* సర్ రతన్ టాటా(1871-1918).. జెమ్‌షెడ్ జీ చిన్న కుమారుడు. కుటుంబ వ్యాపారాన్ని నిర్వహించాడు. ఇతను నవాజ్ బాయి సెట్‌ని వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు పిల్లలు లేరు. సర్ రతన్ టాటా మరణం తర్వాత నవాజ్ బాయి నావల్ టాటాని దత్తత తీసుకున్నారు.
నావల్ టాటా కుటుంబం-వారసులు
* నావల్ హెచ్ టాటా(1904-1989)..సర్ రతన్ టాటా, నవాజ్ బాయిల దత్తపుత్రుడు. నావల్ టాటా సూనూ కమిసరియంట్‌ని వివాహం చేసుకున్నారు. వారికి ‘‘రతన్ టాటా’’, జిమ్మీ టాటా అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. రతన్ టాటా పదేళ్ల వయసులో నావట్ టాటా, సూనూ విడాకులు తీసుకున్నారు. నావల్ తరువాత సిమోన్ డునోయర్‌ని వివాహం చేసుకున్నాడు. వీరికి నోయెల్ టాటా అనే కుమారుడు జన్మించారు.
రతన్ టాటా- బంధువులు:
* రతన్ టాటా తన సోదరుడు జిమ్మీ టాటా, సవతి సోదరుడు నోయెల్ టాటాతో కలిసి పెరిగారు. తల్లిదండ్రుల విడాకుల తర్వాత రతన్ టాటా, జిమ్మీ టాటా ముంబైలోని కుటుంబ ఎస్టేట్ అయిన టాటా ప్యాలెస్‌లో వారి అమ్మమ్మ నవాజ్ బాయి సెట్ వద్ద పెరిగారు.
* రతన్ టాటా(1937-2024) టాటా గ్రూపుని అత్యున్నత స్థాయికి తీసుకెళ్లారు. తన జీవితకాలం వ్యాపారాన్ని విస్తరించే పనిలో నిమగ్నమయ్యారు. 1991 నుంచి 2012లో పదవీ విరమణ చేసే వరకు దాని చైర్మన్‌గా కొనసాగారు. టాటా ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు, దాతృత్వంపై దృష్టి సారించారు. రతన్ టాటా తమ్ముడు జమ్మీటాటా దాదాపుగా ప్రజల దృష్టికి దూరంగా ఉన్నారు. రతన్ టాటా వలే కుటుంబ వ్యాపారంలో పాల్గొనలేదు.
* రతన్ టాటా, జిమ్మీ టాటాల సవతి సోదరుడు నోయెల్ టాటా ప్రస్తుతం టాటా గ్రూపులో ప్రముఖ వ్యక్తి. అతను టాటా ఇన్వెస్టిమెంట్ కార్పొరేషన్ చైర్మన్. టాటా ఇంటర్నేషనల్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు. రతన్ టాటా మరణం తర్వాత టాటా గ్రూపు భవిష్యత్ నాయకత్వం కోసం నోయెట్ టాటా బలమైన పోటీదారుగా ఉన్నారు.
నోయెల్ టాటా కుటుంబం:
నోయెట్ టాటా మరో ప్రసిద్ధి పారిశ్రామికవేత్త పల్లోంజీ మిస్త్రీ కుమార్తె ఆలూ మిస్త్రీని వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. వీరు లీహ్ టాటా, మాయా టాటా, నివిల్లే టాటా.
పెద్దవాడైన లీహ్ టాటా, మాడ్రిడ్‌లోని IE బిజినెస్ స్కూల్ నుండి మార్కెటింగ్‌లో మాస్టర్స్ డిగ్రీని పొందారు మరియు టాటా గ్రూప్‌లో పని చేస్తున్నారు. ప్రస్తుతం ది ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్(IHCL)లో వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్నారు.
మాయా టాటా టాటా క్యాపిటల్‌లో అనలిస్ట్‌గా తన కెరీర్ ప్రారంభించి, కంపెనీలో క్రమంగా ఎదుగుతున్నారు. నెవిల్లే టాటా టాటా యాజమాన్యంలోని ట్రెంట్‌తో తన వ్యాపార కెరీర్‌ని ప్రారంభించారు. ఇప్పుడు నోయెల్ టాటా, అతని వారసత్వం టాటా వ్యాపార కార్యక్రమాల్లో చురుకుగా ఉన్నారు. ప్రస్తుత రతన్ టాటా మరణించడంతో నోయెల్ టాటా టాటా సామ్రాజ్యానికి నాయకత్వం వహించే అవకాశం ఉంది.