Kolkata Rape Case: కోల్‌కతాలో లా విద్యార్థినిపై అత్యాచార ఘటన అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)లో వర్గ విభేదాలకు తావిచ్చింది. పార్టీలోని కొందరు నేతలు ఈ సంఘటనపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో వివాదం ముదిరింది. ఎంపీ కళ్యాణ్ బెనర్జీ, ఎమ్మ్యేల మదన్ మిత్రాలు వివాదాస్పద వ్యాఖ్యలు పార్టీ దూరంగా ఉంది. మరో ఎంపీ మహువా మోయిత్రా ఈ ప్రకటనలు ‘‘అసహ్యకరమైనవి’’ అని అభివర్ణించింది.
మెయిత్రా వ్యాఖ్యలపై కళ్యాణ్ బెనర్జీ స్పందిస్తూ.. ఆమె హనీమూన్ తర్వాత తిరిగి వచ్చి తనపై దాడి చేస్తుందని కామెంట్స్ చేయడం వివాదాన్ని మరింత పెంచింది. గత నెలలో మాజీ బీజేడీ ఎంపీ పినాకీ మిశ్రాతో మహువా మోయిత్రాకు పెళ్లి అయిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఆమె కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తుందని ఆరోపించారు. వచ్చే ఏడాది బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో తృణమూల్‌లో విభేదాలు చర్చనీయాంశంగా మారాయి.
Read Also: Raghava Lawrence : నిన్ను కొట్టను.. వచ్చి కలువు.. అతనికి రాఘవ లారెన్స్ ఆఫర్..
జూన్ 25న లా కాలేజ్ క్యాంపస్‌లో 24 ఏళ్ల విద్యార్థినిపై మనోజిత్ మిశ్రా(31) అనే మాజీ స్టూడెంట్ అత్యాచారం చేశాడు. ఈ ఘటనలో మొత్తం ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మనోజిత్ అత్యాచారం చేయగా, మరో ఇద్దరు విద్యార్థులు వీటిని ఫోన్‌లో రికార్డ్ చేసి, బ్లాక్‌మెయిల్ చేయడానికి ఉపయోగించారని బాధితురాలు ఫిర్యాదు చేసింది. మనోజిత్ అధికార టీఎంసీ స్టూడెంట్ వింగ్ లో కీలక నేతగా ఉన్నాడు. దీంతో అతడిని పార్టీ రక్షిస్తోందని బీజేపీ ఆరోపిస్తోంది.
ఈ ఘటనపై టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఒక స్నేహితుడు మరో స్నేహితురాలిపై అత్యాచారం చేస్తే, మీరు ఆమెకు ఎలా భద్రత కల్పిస్తారు.? అని ప్రశ్నించారు. పాఠశాలల్లో పోలీసులు ఉంటారా..? అని, ఆమెను ఎవరు రక్షిస్తారు.. అని ప్రశ్నించారు. పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే మదన్ మిత్రా కూడా ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలే చేశారు. ‘‘ ఈ సంఘటన అమ్మాయిలకు ఒక మెసేజ్ పంపింది, కళాశాల మూసివేసినప్పుడు ఎవరైనా మీకు ఫోన్ చేస్తే , వెళ్లవద్దు, ఆ అమ్మాయి అక్కడకు వెళ్లకుంటే ఈ సంఘటన జరిగేది కాదు అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై ఎంపీ మహువా మోయిత్రా ఆగ్రహం వ్యక్తం చేసింది.