Ram Mandir: రామ మందిర ప్రారంభోత్సవ వేడుక కోసం దేశం మొత్తం సిద్ధమైంది. జనవరి 22న అయోధ్యలో భవ్య రామమందిరంలో రామ్ లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరగబోతోంది. ప్రధాని నరేంద్రమోడీ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతుండగా.. దేశంలోని ప్రముఖులు 7000 మందికి పైగా ఈ కార్యక్రమానికి వస్తున్నారు. లక్షల్లో ప్రజలు ఇప్పటికే అయోధ్యకు వెళ్లే మార్గాల్లో ఉన్నారు. జనవరి 22న మధ్యాహ్నం గంట పాటు ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరుగుతుంది.
అయోధ్య రామ మందిర ప్రాముఖ్యత:
అయోధ్య రామ మందిరం హిందువులకు ఎంతో పవిత్రమైంది. గత 500 ఏళ్లుగా హిందువులు దీని కోసం పోరాడుతున్నారు. రాముడు ఇక్కడే జన్మించారని నమ్ముతారు.
రామ మందిర శంకుస్థాపన, నిర్వహణ:
రామ మందిరానికి 2020 ఆగస్టు 5న ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. ఈ ఆలయాన్ని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నిర్వహిస్తుంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో కేంద్రప్రభుత్వం రూపొందించిన ట్రస్ట్ 2.7 ఎకరాల విస్తీర్ణంలో ఆలయ నిర్మాణాన్ని పర్యవేక్షించారు.
దర్శనం-హారతి సమయాలు:
అయోధ్య రామ మందిరం ఉదయం 7.00 నుంచి 11.30 వరకు, మధ్యాహ్నం 2.00 నుంచి రాత్రి 7.00 వరకు భక్తులకు దర్శనమిస్తారు. రామ్ లల్లా ఆరతి రోజుకు మూడు సార్లు నిర్వహించబడుతుంది, భక్తులు ఉదయం 6:30 గంటలకు జాగరణ్ లేదా శృంగార్ ఆరతికి, మధ్యాహ్నం 12:00 గంటలకు భోగ్ ఆరతికి మరియు రాత్రి 7:30 గంటలకు సంధ్యా ఆరతికి అనుమతిస్తారు. ఆరతికి హాజరు కావడానికి, వ్యక్తులు ట్రస్ట్ జారీ చేసిన పాస్ అవసరం, దాని కోసం చెల్లుబాటు అయ్యే ID రుజువు తప్పనిసరిగా సమర్పించాలి.
రాముడి దర్శనానికి డబ్బు చెల్లించాలా..?
ఆలయ ప్రవేశం సాధారణంగా అందరికి ఉచితం. ఆలయంలో మూడ రకాల హారుతులు నిర్వహిస్తారు. దీనికి పాస్‌లు ఉచితంగా జారీ చేస్తారు. పాసులు ఉన్న వారిని మాత్రమే హారతికి అనుమతిస్తారు. ఒక్కో హారతికి ఒకే సారి ముప్పై మంది మాత్రమే హాజరుకాగలరు.
రామ మందిర విగ్రహం:
రామ మందిరంలో రామ్ లల్లా(బాల రాముడి) విగ్రహాన్ని ప్రతిష్టిస్తారు. మైసూర్ శిల్పి అరుణ్ యోగి రాజ్ ఈ విగ్రహాన్ని చెక్కారు. నల్లరాయితో చేయబడిన ఈ విగ్రహం 150-200 కిలోల బరువు ఉంటుంది.
రామ మందిరానికి అయిన ఖర్చు:
రామ మందిర నిర్మాణానికి రూ. 1800 కోట్లు అయినట్లు అంచనా. ఈ అంచనా నిర్మాణ వ్యయంలో మెటీరియల్ ఖర్చులు, యంత్రాలు, కార్మికులు, ఇతర పరిపాలన ఖర్చులు ఉన్నాయి. ఫిబ్రవరి 5, 2020, మార్చి 31, 2023 మధ్య అయోధ్య మందిర నిర్మాణానికి రూ.900 కోట్లు ఖర్చు అయినట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి.