Rajnath Singh: దేశ అభివృద్ధిపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత ఆర్థిక వ్యవస్థ గణనీయంగా అభివృద్ధి చెందుతోందని, వందేళ్ల స్వాతంత్ర వేడుకల నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. బీహార్‌లోని గోపాల్ నారాయణ్ సింగ్ యూనివర్శిటీ స్నాతకోత్సవానికి హాజరైన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో పోలిస్తే ప్రస్తుతం దేశ స్థితిగతులు పూర్తిగా మారాయని ఆయన అన్నారు.
Read Also: Cyclone Biparjoy: 12 గంటల్లో అత్యంత తీవ్రమైన తుఫాన్‌గా “బిపార్జాయ్”
గతంలో కాంగ్రెస్ హయాంతో, బీజేపీ అధికారంలోకి వచ్చే నాటికి భారతదేశం ప్రపంచంలో 10వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండేదని, ప్రస్తుతం బీజేపీ హాయాంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని ఆయన అన్నారు. 2027 నాటికి భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుందని మోర్గాన్ స్టాన్లీ తాజా నివేదికను ప్రస్తావిస్తూ అన్నారు. 2027 నాటికి టాప్-3 ఆర్థిక వ్యవస్థగా ఇండియా ఉంటుందని అంతర్జాతీయ వాణిజ్య నిపుణులు భావిస్తున్నారని ఆయన అన్నారు. చాలా మంది విదేశీయులు మనదేశాన్ని ఇండియా అనడం బదులుగా భారత్ అనేందుకు ఇష్టపడుతున్నారని రాజ్ నాథ్ సింగ్ అన్నారు. ప్రపంచంలో భారతదేశానికి గౌరవం పెరిగిందని అన్నారు. ఇది విదేశీయులకు మన దేశ సాంస్కృతిక వారసత్వంపై పెరుగుతున్న అభిమానాన్ని సూచిస్తోందని ఆయన అన్నారు.
ఇప్పుడు ప్రపంచం భారత్ వైపు చూస్తోందని, ప్రధాని మోడీ నాయకత్వంలో బీజేపీ హామీలను నెరవేరుస్తోందని ఆయన అన్నారు. ఆర్టికల్ 370, రామ మందిర నిర్మాణాన్ని చేపట్టామని తెలిపారు. నేడు దేశంలోని దాదాపు 12 కోట్ల ఇళ్లకు కుళాయిల ద్వారా నీరు చేరిందని, 2014లో దాదాపు 18 వేల గ్రామాల్లో కరెంటు లేదని, నేడు ప్రతి ఇంటికి కరెంటు వచ్చిందని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో భారతీయ విద్యార్థులను సురక్షితంగా తరలించే పనిని మన ప్రధాని నరేంద్ర మోదీ చేశారని గుర్తు చేశారు. గతంలో భారత్ లాంటి దేశంలో డిజిటల్ లావాదేవీలు సాధ్యం కావని అంతా అనుకునే వారని.. కానీ ఇప్పుడు డిజిటల్ లావాదేవీల్లో భారత్ దూసుకుపోతుందని అన్నారు.