Cyclone Biparjoy: అరేబియా సముద్రంలో ఏర్పడిన ‘బిపార్జాయ్’ తుఫాన్ రానున్న 12 గంటల్లో అత్యంత తీవ్రమైన తుఫానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) శనివారం తెలిపింది. గుజరాత్ లోని పోర్‌బందర్ తీరానికి 200-300 కి.మీ దూరంలో తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందని తెలిపారు. రాబోయే ఐదురోజులు గుజరాత్ రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలతో పాటు, బలమైన గాలులు వీస్తాయని ఐఎండీ తెలిపింది.
ప్రస్తుతం తుఫాన్ పోర్ బందర్ తీరానికి 600 కిలోమీటర్ల దూరంలో ఉందని తెలిపింది. ప్రస్తుతానికి గుజరాత్ రాష్ట్రాన్ని తుఫాన్ తాకే ప్రమాదం లేదని ఐఎండీ తెలిపింది. రానున్న ఐదు రోజుల్లో మత్స్యకారులు అరేబియా సముద్రంలోకి వెళ్లవద్దని, అన్ని చేపల వేట కార్యకలాపాలను నిలిపివేస్తున్నామని అధికారులు హెచ్చరించారు. ప్రస్తుతం తుఫాన్ ఉత్తర దిశగా కదులుతోంది. ఇది రాబోయే 24 గంటల్లో ఈశాన్య దిశగా దాని మార్గాన్ని మార్చుకునే అవకాశం ఉంది. ఆ తరువాత ఉత్తర-వాయువ్య దిశగా వెళ్లే అవకాశం ఉంది.
Read Also: Ravindra Jadeja: జడేజానా మజాకా.. తొలి భారత క్రికెటర్‌గా చరిత్ర
రానున్న ఐదు రోజలు పాటు గుజరాత్ లో వర్షం కురుస్తుందని, ముఖ్యంగా సౌరాష్ట్ర-కచ్ ప్రాంతంలో గాలి వేగం ఎక్కువగా ఉంటుందని ఐఎండీ తెలిపింది. ఐఎండీ ప్రకారం.. శనివారం ఉదయం 11.30 గంటలకు తూర్పు తూర్పు మధ్య అరేబియా సముద్రం మీద గోవాకు పశ్చిమ-వాయువ్యంగా 700 కి.మీ, ముంబైకి పశ్చిమ-నైరుతి దిశలో 620 కి.మీ, పోర్‌బందర్‌కు 590 కి.మీ నైరుతి-నైరుతి మరియు కరాచికి 900 కి.మీ దూరంలో తుఫాన్ కేంద్రీకృతమై ఉంది.
వచ్చే 24 గంటల్లో మరింత బలపడి ఉత్తర-ఈశాన్య దిశగా క్రమంగా కదులుతుందని, ఆ తరువాత మూడు రోజుల్లో ఉత్తర వాయువ్య దిశగా కదులుతుందని ఐఎండీ తెలిపింది. సౌరాష్ట్ర-కచ్ ప్రాంతంలో గంటకు 30-40 కి.మీ వేగంతో గాలులు వీస్తాయి. ఆ తర్వాత జూన్ 13-15 తేదీల్లో ఈ ప్రాంతంలో ముఖ్యంగా తీర ప్రాంతాల్లో గంటకు 30-50 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ముఖ్యంగా పోర్‌బందర్ మరియు కచ్ మరియు జామ్‌నగర్ వంటి తీరప్రాంత జిల్లాలలో గంటకు 60 కి.మీ మరియు 75 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించింది. పోర్‌బందర్, గిర్ సోమనాథ్, వల్సాద్ జిల్లాల్లో ఎన్డీఆర్ఎఫ్ బలగాలను మోహరించారు.