Congress party key meeting in Rajasthan: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు రాజస్థాన్ కాంగ్రెస్ లో చిచ్చు పెడుతోంది. సీఎం అశోక్ గెహ్లాట్ పార్టీ అధ్యక్ష పదవి కోసం పోటీలో ఉండనున్నారు. దీంతో ఆయన సీఎం పదవిని వదులుకోనున్నారు. అయితే ముందుగా అశోక్ గెహ్లాట్ పార్టీ అధ్యక్ష పదవితో పాటు రాజస్థాన్ సీఎంగా కొనసాగాలని అనుకున్నప్పటికీ.. రాహుల్ గాంధీ ‘‘ఒక వ్యక్తికి ఒక పదవి’’ అనేది కాంగ్రెస్ నిర్ణయం అని స్పష్టం చేశారు. దీంతో ఇక గెహ్లాట్ అధ్యక్షుడు అయితే సీఎం పోస్టు వదులుకోవాల్సిందే.
ఇదిలా ఉంటే అశోక్ గెహ్లాట్ సీఎం పదవి వదులుకుంటే.. తదుపరి రాజస్థాన్ సీఎం సచిన్ పైలెట్ అని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం అశోక్ గెహ్లాట్ ఇంట్లో కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో సీఎం అభ్యర్థిత్వంపై సోనియా గాంధీ నిర్ణయం తీసుకుంటారని తీర్మానం చేయనున్నారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కూడా కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేయడానికి ముందే తన పదవికి రాజీనామా చేసే అవకాశం ఉంది.
Read Also: India vs Australia T20 Match: డూ ఆర్ డై ఫైట్.. ఉప్పల్ వేదికగా నేడు కీలక మ్యాచ్..
ఈ రోజు సాయంత్రం జరిగే సమావేశానికి ఏఐసీసీ ఇంఛార్జ్ అజయ్ మాకెన్ తో పాటు రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే హాజరుకానున్నారు. ఆదివారం కాంగ్రెస్ మీటింగ్ జరగడానికి ముందే శనివారం అజయ్ మాకెన్, సోనియా గాంధీతో సమావేశం అయ్యారు. రాజస్థాన్ పరిణామాలను అజయ్ మాకెన్, మల్లికార్జున ఖర్గేలు పరిశీలిస్తారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు.
ఇదిలా ఉంటే సచిన్ పైలెట్ సీఎం పదవి కోసం పావులు కదుపుతున్నారు. కాగా.. సచిన్ పైలెట్ అభ్యర్థిత్వాన్ని ప్రస్తుత సీఎం అశోక్ గెహ్లాట్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సచిన్ పైలెట్ కాకుండా.. స్పీకర్ జోషిని ముఖ్యమంత్రిని చేయాలని అశోక్ గెహ్లాట్ కోరుతున్నారు. ఇక కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం అశోక్ గెహ్లాట్, శశి థరూర్ పోటీ పడుతున్నారు. వీరితో పాటు మరికొంత మంది పోటీ చేసే అవకాశం ఉంది. 1998 తరువాత తొలిసారి గాంధీయేతర కుటుంబం నుంచి కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షులు రాబోతున్నారు.