ప్రముఖ పారిశ్రామిక వేత్త రాహుల్ బజాజ్ పుణేలో కన్నుమూశారు. ఆయన వయసు 83 ఏళ్ళు. గత కొద్ది రోజులుగా ఆయన న్యుమోనియా, గుండె సమస్యలతో బాధ పడుతున్నారు. నెల రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం పూర్తిగా విషమించింది. దీంతో ఆయన ఇవాళ మధ్యాహ్నం 2. 30 గంటలకు తుదిశ్వాస విడిచారని బజాజ్ గ్రూప్ ఒక ప్రకటన విడుదల చేసింది.
గతేడాది ఏప్రిల్‌లో బజాజ్ ఆటో చైర్మన్ పదవికి రాహుల్ బజాజ్ రాజీనామా చేశారు. 40 ఏళ్ల పాటు బజాజ్ గ్రూప్ చైర్మన్‌గా సేవలను అందించారు. 2001లో భారత మూడో అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్ రాహుల్ బజాజ్‌కు లభించింది. అంతేకాకుండా రాజ్యసభ ఎంపీగా కూడా ఆయన పనిచేశారు. భారతీయ వ్యాపార రంగంలో ఆయన తనదైన ముద్రవేశారు.
రాహుల్ బజాజ్ ఇకలేరన్న వార్త తమను కలిచి వేసిందని పలువురు ప్రముఖులు నివాళి అర్పించారు. రాహుల్‌జీ పరిశ్రమలో కీలకపాత్ర పోషించారని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని అందించాలని కేంద్ర రోడ్డు శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ట్విటర్‌లో స్పందించారు. ఏపీ సీఎం జగన్ రాహుల్ బజాజ్ సేవలను కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.