Rahul Gandhi: బీహార్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. సైన్యం దేశ జనాభాలో 10 శాతం మంది (అగ్రకులాలను సూచిస్తూ) నియంత్రణలో ఉందని మంగళవారం అన్నారు. బీహార్ ఔరంగబాద్‌లో ప్రచారం చేస్తూ.. దేశ జనాభాలో 10 శాతం మందికి కార్పొరేట్ రంగాలు, బ్యూరోక్రసీ, న్యాయవ్యవస్థలో అవకాశాలు లభిస్తున్నాయి, సైన్యం కూడా వారి నియంత్రణలో ఉంది అని అన్నారు. మిగిలిన 90 శాతం, వెనుకబడిన తరగతులు, దళితులు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర మైనారిటీలు ఎక్కడా కనిపించడం లేదని చెప్పారు.
మరోసారి, రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యల ద్వారా కుల గణన డిమాండ్‌ను మరోసారి లేవనెత్తారు. భారతదేశంలో వెనకబడి ఉన్న 90 శాతం మందిని గుర్తించి, వారికి హక్కులు, రాజ్యాంగ హామీలను రక్షించడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. 90 శాతం మందికి భాగస్వామ్య హక్కులు లేకపోతే, రాజ్యాంగాన్ని రక్షించలేమని అన్నారు.
Read Also: Pakistan: ట్రంప్ ‘‘అణు పరీక్ష’’ కామెంట్స్.. స్పందించిన పాకిస్తాన్..
దీనికి ముందు, భారత్ జోడో యాత్రలో అరుణాచల్ ప్రదేశ్‌లో చైనా దళాలు భారత సైనికుల్ని కొడుతున్నాయి అని రాహుల్ గతంలో వ్యాఖ్యానించారు. ఆగస్టులో ఈ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. డిసెంబర్ 2022లో అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్‌లో జరిగిన భారత్-చైనా సైనిక ఘర్షణను ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 2000 చ.కి.మీ భారత భూభాగాన్ని స్వాధీనం చేసుకున్నాయి అని రాహుల్ ఆరోపించారు.
జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ఎ.జి. మసీహ్‌లతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. ‘‘2000 చ.కి.మీ భూమిని చైనా స్వాధీనం చేసుకుందని మీకు ఎలా తెలిసింది.? మీరు నిజమై భారతీయులైతే, ఇలాంటివి చెప్పరు’’ అని జస్టిస్ దత్తా రాహుల్ గాంధీని తీవ్రంగా మందలించారు.
