Rahul Gandhi: కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రస్తుతం కేరళలో కొనసాగుతోంది. తన యాత్రలో రాహుల్ గాంధీ చలాకీగా, ఉత్సాహంగా కనిపిస్తున్నారు. ఏ మాత్రం అలసట లేకుండా ఆయన ముందుకు సాగిపోతున్నారు. ప్రకృతి అందాలకు పెట్టింది పేరైన కేరళలో పర్యటిస్తున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ తన పాదయాత్ర మధ్యలో దొరికిన విరామాన్ని ఉల్లాసంగా గడుపుతున్నారు. సోమవారం నాడు కేరళలో పర్యటిస్తున్న సందర్భంగా పున్నమాడ సరస్సులో జరిగిన స్నేక్ బోట్ రేసులో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ మేరకు పడవ సిబ్బంది, పార్టీ నేతలతో కలిసి రాహుల్ గాంధీ ఉత్సాహంగా తెడ్డేశారు. తెడ్డేసిన నేపథ్యంలో కాస్తంత అలసట వచ్చినట్లు కనిపించిన రాహుల్ గాంధీ తన కుడి చేతి భుజాన్ని ఎడమ చేతితో రుద్దుకున్నారు. పడవ రేసులో పాల్గొన్న రాహుల్ గాంధీ వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
बोल रे साथी हल्ला बोल.. ✊ pic.twitter.com/5u91qbDxy7
— Srinivas BV (@srinivasiyc) September 19, 2022
రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ సీనియర్ లీడర్ కేసీ వేణుగోపాల్ సైతం బోటు రేసులో పాల్గొన్నారు. ఈ స్నేక్ బోట్ రేసులను చూసేందుకు చుట్టు పక్కల ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. ఇలాంటి పోటీలు యువతలో ఉత్సాహాన్ని నింపుతాయని రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. అనంతరం బోటు రేసు విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా కొనసాగనుంది. ఈ పాదయాత్ర ప్రారంభించి 11వ రోజులు పూర్తయింది. సోమవారం అలప్పుజలోని పున్నప్రా అరవుకడ్‌లో భారత్ జోడో యాత్ర 12వ రోజుకు ప్రారంభం పలికారు. అక్కడ వడకల్ బీచ్‌లో మత్స్యకారుల సమస్యలను రాహుల్ గాంధీ తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇంధన ధరలు, సబ్సిడీలు, పర్యావరణ విధ్వంసం వంటి సమస్యలపై రాహుల్ చర్చించారు. కాగా కేరళలోని రాహుల్ గాంధీ యాత్రలో తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా పాల్గొన్నారు.
