Himanta Biswa Sarma: మరోసారి అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ సర్మ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని టార్గెట్ చేశారు. మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న హిమంత, రాహుల్ గాంధీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఔరంగజేబు, బాబార్‌లకు వేసినట్లే అని ఆయన అన్నారు. అక్టోబర్ 7న ఇజ్రాయిల్ పై హమాస్ దాడి చేస్తే దానిపై రాహుల్ గాంధీ ఒక్కమాట కూడా మాట్లాడలేదని, అయితే అతను ‘ఇండియా హమాస్’ భయపడుతున్నాడని, కానీ ప్రధాని నరేంద్రమోడీ మాత్రం ఉగ్రదాడిని ఖండించారని ఆయన అన్నారు.
బీజేపీ రామమందిరం వైపు, కాంగ్రెస్ బాబ్రీ మసీదు వైపు ఉన్నాయని మధ్యప్రదేశ్ ప్రజలు వచ్చే ఎన్నికల్లో ఏదో ఒకటి ఎంచుకోవాలని అన్నారు. ‘‘ఈ రోజు మీరు ఇజ్రాయిల్-పాలస్తీనా యుద్ధవార్తలు చూస్తున్నారు.. పాలస్తీనాతో మాకు ఎలాంటి సమస్య లేదు, అయితే హమాస్ ఏం చేసింది..? వారు పిల్లల్ని అపహరించి చంపారు, వందలాది మందిని బందీలుగా ఉంచారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రధాని మోడీ గట్టి సందేశం ఇచ్చారు. కానీ రాహుల్ గాంధీ మాత్రం ఇండియా హమాస్‌కి భయపడుతున్నారు, అందకే హమాస్ పై ఒక్క మాట అనడం లేదు’’ అని హిమంత ఆరోపించారు.
Read Also: Delhi Air Pollution: ఢిల్లీలోకి యాప్- ఆధారిత ట్యాక్సీలపై నిషేధం..
ఆర్టికల్ 370 రద్దు చేయడానికి, పీఎఫ్ఐని నిషేధించడానికి అమిత్ షా భయపడలేదని అస్సాం సీఎం అన్నారు. దేశాన్ని రక్షించేందుకు ప్రధాని మోడీ ఏమైనా చేయగలరని ‘ఇండియా హమాస్ ప్రజలకు తెలుసు’ అని అన్నారు. అంతకుముందు కాంగ్రెస్ పాలనలో మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని ‘బీమారు రాష్ట్రం’గా తయారు చేశారని, అయితే బీజేపీ పాలనలో మార్పు వచ్చిందని అన్నారు. కాంగ్రెస్ నాయకుడిగా తాను మొదటిసారి మధ్యప్రదేశ్ కి వచ్చినప్పుడు రోడ్ల కన్నా గొయ్యిలు, కరెంట్ కన్నా కరెంట్ కోతలు ఎక్కువగా ఉండేవని ఆరోపించారు.
మసీదు స్థానంలో ఇప్పుడు రామమందిరాన్ని పునర్నిర్మిస్తున్నామని, కాంగ్రెస్ ఎందుకు ఈ పనిని చేయలేదని ప్రశ్నించారు. జవహర్ లాల్, ఇందిరా గాంధీలు ఎందుకు నిర్మించలేదని హిమంత అడిగారు. నరేంద్రమోడీ అధికారంలోకి రాకపోయి ఉంటే రామమందిరాన్ని కట్టేవారా..? రాహుల్ గాంధీ, కమల్ నాథ్ ఎప్పుడైనా అయోధ్య వెళ్లారా..? అని ప్రశ్నించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ నాయకులు దేవాలయాలకు వెళ్తారని ఎద్దేవా చేశారు. అక్బర్ వ్యాఖ్యలపై ఈసీ నోటీసుల గురించి స్పందించిన హిమంత.. ఈ దేశంలో జన్మించినందుకు నేను అక్బర్, ఔరంగజేబుపై వ్యాఖ్యానించకుంటే… ఎవరిపై వ్యాఖ్యానించాలి అని అడిగారు. కమల్ నాథ్ తాను హనుమాన్ భక్తుడని చెప్పి.. హనుమాన్ ఉన్న కేకును కట్ చేస్తాడంటూ విమర్శించారు. ఛత్తీస్గఢ్ లో మహాదేశ్ పేరును అవమానిస్తున్నారని బెట్టింగ్ యాప్ వివాదంపై విమర్శలు గుప్పించారు.