Rahul Gandhi criticizes BJP in Adani case: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బీజేపీపై ఫైర్ అయ్యారు. పార్లమెంట్ లో అదానీ వ్యవహారం, అగ్నివీర్ స్కీమ్ గురించి విమర్శించారు. భారత్ జోడో యాత్ర అనుభవాలను వివరిస్తూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. పాదయాత్రలో నిరుద్యోగం, పెరిగిన ధరలు, రైతుల సమస్యలు నా దృష్టికి వచ్చాయని వెల్లడించారు. అగ్నివీర్ యోజన సైనికులు నుంచి వచ్చిన ఆలోచన, ప్రతిపాదన కాదని, ఈ ఆలోచన, ప్రతిపాదన జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్ ది అని అన్నారు.
ప్రతీ రాష్ట్రంలో అదానీ గురించే చర్చ జరుగుతోందని.. అదానీ ప్రతీ వ్యాపారంలో దూరిపోతాడని, విజయం సాధిస్తాడని, ఆ బిజినెస్ ట్రిక్ ఏమిటో మాకు చెప్పాలని, మేము కూడా అదానీలా కావాలనుకుంటున్నామని ప్రభుత్వంపై సెటైర్లు వేశారు. 2014 లో 8 బిలియన్ డాలర్ల అదానీ వ్యాపార సామ్రాజ్యం 2022 లో 140 బీలియన్ డాలర్లు సామ్రాజ్యం గా మారిపోయిందన్నారు. అదానీ కోసం కేంద్ర ప్రభుత్వం కొన్ని నిబంధనలను సవరించిందని ఆరోపించారు. ప్రపంచ సంపన్నుల జాబితాలో 2014 లో 609 స్థానంలో ఉన్న అదానీ, 2022 లో 2 వ స్థానంలోకి ఎలా వచ్చారని ప్రశ్నించారు.
Read Also: Virat Kohli: అరుదైన రికార్డు ముంగిట కోహ్లీ..మరో 64 రన్స్ చేస్తే!
ఈ సమయంలో మోదీ అండగా ఉంటే సాధ్యం కానిదేముందని కాంగ్రెస్ నేతలు కేకలు వేశారు. మోదీ, అదానీల బంధం ఈ రోజుది కాదని రాహుల్ గాంధీ ఆరోపించారు. 2014లో అదానీ అసలు మ్యాజిక్ మొదలైందని అన్నారు. ఎయిర్ పోర్టు అభివృద్ధిలో పూర్వ అనుభవం లేని వారికి ఎయిర్ పోర్టు అభివృద్ధి, నిర్మాణ పనులలో కాంట్రాక్ట్ ఇవ్వరాదని నిబంధన ఉంది..ఆ నిబంధన ను మార్చారు. అదానీ కి ఆరు ఎయుర్ పోర్టులు ఇచ్చారని విమర్శించారు. ముంబై ఎయిర్ పోర్టు అభివృద్ధి పనులు జివికే సంస్థ చేస్తుంటే, దర్యాప్తు సంస్థలను ఉపయోగించి అదానీకి అప్పగించారని విమర్శించారు.
వర్ధమాన వ్యాపారులకు, వాణిజ్య సంస్థ లకు ఇదొక నమూనా అని దీనిపై రీసెర్చ్ చేయాలని, ప్రభుత్వ అధికారాన్ని ఉపయోగించి, వ్యక్తుల వ్యాపార సామ్రాజ్యాలను ఎలా అభివృధ్ది చేయాలో స్పష్టమౌతుందని ఆరోపించారు. రక్షణ రంగంలోకి కూడా అదానీ ప్రవేశించారని.. ఎల్బిట్ కంపెనీతో కలిసి భారత్ లో అదానీ డ్రోన్ంలను తయారు చేస్తారని.. ఈడ్రోన్లను భారత్ త్రివిధ దళాలకు సరఫరా చేస్తారని రాహుల్ గాంధీ అన్నారు. అదానీ గతంలో డ్రోన్లు తయారీ ఎప్పుడూ చేయలేదని.. ప్రధాని ఇజ్రాయిల్ వెళ్తారు.. తర్వాత అదానీకి సంబంధిత కాంట్రాక్ట్ వస్తుంది అంటూ ఆయన ఆరోపించారు. భారత్-ఇజ్రాయిల్ రక్షణ సంబంధాలు ధనికుల చేతుల్లోకి వెళ్లిపోయాయని అన్నారు. ఇందులో పెగాసిస్ కూడా ఉందని విమర్శించారు. భారత రక్షణ రంగానికి ఎలక్ట్రానిక్స్ ను సరఫరా చేసే “అల్ఫా డీఫెన్స్” అనే కంపెనీ నీ కూడా అదానీ కైవసం చేసుకున్నారని పేర్కొన్నాడు.
రాహుల్ గాంధీ విమర్శలపై బీజేపీ కూడా ఘాటుగానే స్పందించింది. కేంద్ర మంత్రులు రవిశంకర్ ప్రసాద్, కిరణ్ రిజిజులు రాహుల్ ఆరోపణలను ఖండించారు. చేసే ఆరోపణలకు సాక్ష్యాలు ఉంటే చూపాలని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు డిమాండ్ చేశారు. లోకసభ కార్యక్రమాలకు సంబంధించి 353 నిబంధన కింద ముందుగా నోటీసు ఇవ్వకుండా ఏలాంటి ఆరోపణలు, బెదిరింపు చర్యలకు పాల్పడకూడదంటూ మాజీ మంత్రి రవిశంకర్ స్పీకర్ దృష్టికి తెచ్చారు. ప్రధాని కి వ్యతిరేకంగా, నోటీసు ఇవ్వకుండా, నేరుగా చేసే ఆరోపణలు నిరాధారమైనవి.. రికార్డులు నుంచి రాహుల్ వ్యాఖ్యలను తొలగించాలంటూ డిమాండ్ చేశారు.