రోజురోజుకీ కునారిల్లుతున్న కాంగ్రెస్ పార్టీకి ఒక పాదయాత్ర బూస్ట్ ఇస్తుందా? అన్నివేల కిలోమీటర్లు పాదయాత్ర చేయడం సాధ్యమేనా? రాహుల్ గాంధీకి నిజంగా అంత ఓపిక వుందా? రాహుల్ వయసు, ఫిట్ నెస్ రీత్యా చూస్తే ఆయన చేయగలరని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. సుదీర్ఘ పాదయాత్ర లేదా బస్సుయాత్రను రాహుల్ చేపట్టగలరు. అయితే రాహుల్ కు బాడీ ఫిట్ నెస్ ఉంది కానీ ఆయన అలాంటి యాత్రలకు మానసికంగా రెడీగా ఉన్నారా అనేదే మిలియన్ డాలర్ల ప్రశ్న. రాహుల్ ది కార్పొరేట్ లైఫ్ స్టైల్. అప్పుడప్పుడు వెకేషన్లు విరామాలు కోరుకుంటుంటాడు. అకస్మాత్తుగా దేశం విడిచి ఆయన విదేశాలకు వెళ్లిపోతుండాడు. అలాంటి వ్యక్తి 150 రోజులు అంటే ఏకంగా 5 నెలలు పాటు దేశంలో పాదయాత్ర చేపడతాడా?
అమేథీకి వెళ్లి ఒకటీ రెండురోజులు పూరి గుడిసెల్లోకి వెళ్లి ఫొటోలు దిగడంవరకూ సరే… కానీ ఇరుకు రోడ్లు, మట్టి, బురద మధ్య రాహుల్ ఎలా నడుస్తారు? జనంతో మమేకమై వారితో కలిసి నడవగలరా… వారితో కలిసి తినగలరా? కాంగ్రెస్ తరఫున గత కొన్ని దశాబ్దాల్లో విస్తృతంగా జనాల్లోకి వెళ్లిన నేతల దాఖలాలు లేవు. ఉమ్మడి ఏపీలో వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత ఆ పార్టీ తరఫున ప్రజల్లోకి వెళ్లే కార్యక్రమం చేపట్టిన నేత దేశం మొత్తంమీద కూడా లేరు. అందుకే ఆ పార్టీ క్రమక్రమంగా కృశించిపోతూ ఉందని టాక్ వినిపిస్తోంది. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు రాహుల్ ఏం చేయబోతున్నారనేది ఉత్కంఠగా వుంది.