Tarvinder Singh Marwah: అమెరికా పర్యటనలో లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ముఖ్యంగా సిక్కులను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలపై బీజేపీతో పాటు సిక్కు సంఘాలు భగ్గుమన్నాయి. బుధవారం సోనియా గాంధీ నివాసం వెలుపల పలువురు సిక్కులు ఆందోళన చేశారు. ‘‘సిక్కులు తలపాగా, కడియాలు ధరించేందుకు అనుమతిస్తారా..? వారు గురుద్వారాలకు వెల్లగలుగుతున్నారా..? భారతదేశంలో ఈ విషయాలపై పోరాటం జరుగుతోంది’’ అని వ్యాఖ్యానించాడు. చివరకు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల్ని ఖలిస్తాన్ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ కూడా సమర్ధించడం, భారత్‌లో సిక్కులు అణిచివేతకు గురవుతున్నారని అందుకే ‘‘ఖలిస్తాన్’’ ప్రత్యేక దేశాన్ని కోరుతున్నామని అన్నారు.
Read Also: CM Chandrababu: సీతారాం ఏచూరి మృతి పట్ల సీఎం చంద్రబాబు సంతాపం
ఇదిలా ఉంటే, ఈ వ్యాఖ్యలపై దేశంలో నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఈ రోజు జరిగిన నిరసన కార్యక్రమంలో ఢిల్లీ బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే తర్విందర్ సింగ్ మార్వా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ‘‘రాహుల్ గాంధీ, రండి, లేకుంటే రాబోయే రోజుల్లో మీ నానమ్మకు పట్టిన గతే మీకు పడుతుంది.’’ అని హెచ్చరించారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీని సిక్కు బాడీగార్డులు చంపిన విషయాన్ని ప్రస్తావిస్తూ రాహుల్ గాంధీని హెచ్చరించారు.
అయితే, దీనిపై కాంగ్రెస్ ఫైర్ అవుతోంది. దేశంలో ప్రతిపక్ష నేతను చంపేస్తామని బహిరంగంగా బెదిరిస్తున్నారని, ప్రధాని నరేంద్రమోడీ ఈ నాయకుడి వ్యాఖ్యలపై మౌనంగా ఉండొద్దని, ఇది చాలా తీవ్రమైన విషయం, ఈ వ్యాఖ్యలు మీ పార్టీ ద్వేషపూరిత కర్మాగారం నుంచి ఉత్పత్తి. దీనిపై చర్యలు తీసుకోవాల్సి ఉంది అని కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగం ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది.