Queen Elizabeth II Visits To India: బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ 2 మరణించడం యావత్ ప్రపంచాన్ని దిగ్బ్రాంతికి గురిచేసింది. 70 ఏళ్ల పాటు యూకే రాణిగా పరిపాలించిన ఎలిజబెత్ 2 మూడు సార్లు రాణి హోదాలో భారత పర్యటకు వచ్చారు. ఆమె భారత పర్యటనకు వచ్చిన ప్రతీ సందర్భంలోనూ అపూర్వ స్వాగతం లభించింది. క్వీన్ ఎలిజబెల్ 2 1961లో రాణి హోదాలో ఇండియాకు వచ్చారు. ఆ సమయంలో ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో ఘన స్వాగతం లభించింది. క్వీన్ ఎలిజబెత్ 2 భారత ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సభకు ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ కూడా హజరయ్యారు. ఆమె భర్త ప్రిన్స్ ఫిలిప్ తో కలిసి భారత్ పర్యటనకు వచ్చారు. ఢిల్లీ, చెన్నై, కోల్ కతాల్లో ఆమె పర్యటించారు. ఆగ్రాలోని తాజ్ మహల్, న్యూఢిల్లీలోని రాజ్ ఘాట్ సందర్శించి మహాత్మాగాంధీకి నివాళులు అర్పించారు.

రాణిగా బాధ్యతలు చేపట్టక ముందు 1911లో ఎలిజబెల్ 2, తాత కింగ్ జార్జ్-5 ఆయన భార్య క్వీన్ మేరి పట్టాభిషేకానికి గుర్తుగా ఢిల్లీలో పర్యటించారు. 1961 పర్యటన తర్వాత దాదాపుగా రెండు దశాబ్ధాల తర్వాత మరోసారి 1983లో కామన్వెల్త్ నేతల శిఖరాగ్ర సమావేశానికి మరోసారి భారత్ పర్యటనకు వచ్చారు. క్వీన్ ఎలిజబెత్ 2 రెండవ పర్యటనలో మదర్ థెరిసాకు ‘ ఆర్డర్ ఆఫ్ ది మెరిట్’ను అందించారు. ఇక చివరి సారిగా 1997లో భారత్ ను సందర్శించారు. అన్నింటి కన్నా ముఖ్యమైన పర్యటనగా దీన్ని పేర్కొంటారు. భారత్, పాకిస్తాన్ స్వాతంత్య్రం సాధించి 50 ఏళ్లు గడిచిన సందర్భంగా ఆమె ఇండియాను సందర్శించారు.
1997 పర్యటనలో తొలిసారిగా ఆమె 1919లో జరిగిన జలియన్ వాలా బాగ్ దురాగతంపై స్పందించారు. జలియన్ వాలా బాగ్ ప్రాంతంలో గుమిగూడిన వందలాది మందిని అత్యంత దారుణంగా బ్రిటీష్ వారు కాల్చి చంపారు. అయితే ఈ ఘటనపై క్షమాపణలు చెప్పాలనే డిమాండ్ వ్యక్తం అయింది. జలియన్ వాలాబాగ్ బాధ కలిగించే ఉదాహరణ క్వీన్ ఎలిజబెత్ 2 అన్నారు. కొన్ని విషయాలు బాధ కలిగించే ఉదాహరణలు అని.. కానీ చరిత్రను తిరిగా రాయలేదని.. వ్యాఖ్యానించారు.