దేశంలో కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. కేసులు పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళనలు చెందుతున్నారు. ఆంక్షలు సడలించడంతో నిబంధనలను పక్కన పెట్టి బయట తిరుగుతుండటంతో కేసులు భారీగా పెరుగుతున్నాయి. పైగా ఇప్పుడు పిల్లల్లో కరోనా కేసులు బయటపడుతుండటంతో దేశంలోని అన్ని రాష్ట్రాలు అప్రమత్తం అయ్యాయి. తిరిగి ఆంక్షలు విధించేందుకు సిద్దమవుతున్నాయి. తాజాగా పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 16 వ తేదీ నుంచి ఇతర రాష్ట్రాల నుంచి పంజాబ్‌లోకి అడుగుపెట్టాలంటే తప్పనిసరిగా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకొని ఉండాలి లేదంటే ఆర్టీపీసీఆర్ నెగెటివ్ సర్టిఫికెట్ అయినా ఉండాలని ప్రభుత్వం పేర్కొన్నది. దేశంలో కేసులు మళ్లీ పెరుగుతున్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు పంజాబ్ ప్రభుత్వం ప్రకటించింది. రోడ్డు, రైలు, విమానం ఏ మార్గం ద్వారా రాష్ట్రంలోకి అడుగుపెట్టేవారికైనా ఈ నిబంధనలు తప్పకుండా వర్తిస్తాయని ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ పేర్కొన్నారు.